యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఐదేళ్లుగా ఏమీ చేయకుండా నాన్చడమే చంద్రబాబు చేసిన తప్పా…? చివరి నిమిషంలో హడావిడి చేస్తే ప్రజలు నమ్మలేదా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. నారా చంద్రబాబునాయుడు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఆయనను ఏపీ ప్రజలు నమ్మారు. భారతీయ జనతా పార్టీ, జనసేన మద్దతుతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబునాయుడు ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండేందుకు పదేళ్ల పాటు అవకాశం ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసులో వివాదంలో చిక్కుకుని అమరావతికి మకాం మార్చారు.అయితే తాను బస్సులో పడుకకుని పాలన చేశానన్నా ప్రజలు నమ్మలేదు. ఓటుకు నోటుకు కేసుకు భయపడే వచ్చారని ప్రజలు బలంగా విశ్వసించారు. రాజధాని నిర్మాణం విషయంలోనూ చంద్రబాబు చేసిన హడావిడిప్రజలకు రుచించలేదు. నాలుగున్నరేళ్ల పాటు రాజధాని నిర్మాణం డిజైన్లు కూడా ఖరారు చేయలేదు. సింగపూర్ తరహా నిర్మాణమంటూ ఊదరగొట్టారు. రాజధాని నిర్మాణం పూర్తి చేయకుంటే తననే మరోసారి ప్రజలు ఎన్నుకుంటారని చంద్రబాబు విశ్వసించడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు.ఇక పోలవరం విషయంలోనూ అదే పరిస్థితి కన్పించింది. అనవసరపు ఆర్భాటాలు, పోలవరం సందర్శనల పేరిట మీడియాలో గోల తప్ప వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నదుల అనుసంధానం విషయాన్ని కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. భారతీయ జనతా పార్టీతో విభేదించిన తర్వాత పోలవరం పనులు పూర్తిగా మందగించాయి. సోమవారాన్ని పోలవరం చేసుకున్నానన్నా ప్రజలు పట్టించుకోలేదు. కానీ ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలు, అవినీతితో చంద్రబాబు పాలన పై వ్యతిరేకత కనపడింది.ఇక బీజేపీతో విడిపోయాక చంద్రబాబునాయుడు చేసిన దీక్షలు సయితం వెగటు పుట్టించాయి. ప్రత్యేక హోదా కోసం తొలుత రాజీపడి తిరిగి అదే కారణంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడాన్ని ప్రజలు డ్రామాగా తెలుసుకున్నారు. కేంద్రంపై పోరాటంతో పైచేయి సాధించాలనుకున్న చంద్రబాబుకు నిరాశే ఎదురయింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశమే పనిచేయలేదు. ఇక అభివృద్ధి పేరిట చంద్రబాబు చేసిన హడావిడి కూడా కేవలం మీడియాకే పరిమితమయింది. అనుభవాన్నిఈసారిప్రజలు
చూడలేదు. యువనాయకత్వానికే జనం జైకొట్టారు.