యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో వైసీపీ జగన్ సృష్టించిన జన సునామీలో టీడీపీ దిగ్గజనాయకుల వారసులు ఓటమి బాటపడ్డారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభమైన నాటి నుంచి కూడా టీడీపీ టెకెట్‌పై పోటీ చేసిన అతిరథమహారథుల తపయులు ఓటమి అంచున వేలాడారు. ప్రతి రౌండ్‌లోనూ వెనుకబడ్డారు. ముఖ్యంగా సానుభూతి పవనాలు జోరందుకుంటాయని, గెలుపు ఖాయమని అనుకున్న చోట కూడా ప్రజలు వైసీపీనే ఆదరించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, దివంగత గాలి ముద్దుకృష్ణమ తనయుడు గాలి భానుప్రకాశ్ రెడ్డి గెలిచి తీరతారని అందరూ అనుకున్నారు. అయితే, తాజా ఫలితాల్లో ఆయన హోరా హోరీగా పోటీ ఇచ్చినా.. చివరికి ఇక్కడ నుంచి వరుసగా రెండో సారి పోటీ చేసిన ఎమ్మెల్యే రోజా విజయం సాధించారు. వారసులు ఎక్కువగా రంగంలోకి దిగిన అనంతపురంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఇక్కడి తాడిపత్రి నియోజకవర్గంలో
చక్కం తిప్పిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల హవాకు తాజా ఎన్నికలు అడ్డుకట్ట వేశాయి. ఇక్కడ నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాజా ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆయన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నా.. తాజా ఫలితాల్లో చతికిల పడ్డారు. ఇక, అనంతపురం ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచిన దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి కూడా ఓటమి అంచున ఊగిసలాడుతున్నారు. అదే విధంగా ఇదే జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో తమకు తిరుగులేదని అనుకున్న పరిటాల వర్గం కూడా కుప్పకూలింది. గత 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించిన పరిటాల సునీత తాజా ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి మరీ తన కుమారుడికి అవకాశం కల్పించారు.నామినేషన్ డే నుంచి చాకచక్యంగా ప్రచారం చేసిన పరిటాల శ్రీరాం.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. దీంతో పరిటాల శ్రీరాం విజయం ఖాయమని, లక్షకు పైగానే మెజారిటీ ఆయన సొంతం చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో కోట్లకు కోట్లు బెట్టింగులు కూడా కట్టారు. అయితే, తాజా ఎన్నికల ఫలితాలు మాత్రం శ్రీరాంను కుంగదీశాయి. ఆయన పూర్తిగా ఓటమి అంచుల్లో వేలాడారు. అదే విధంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిఫ్యూటీ సీఎం తనయుడు కేఈ సుధీర్ కూడా పరాజయానికి చేరువగానే కొనసాగుతున్నారు. ఇక, విజయనగరం నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగిన.. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు కూడా ఓడిపోయారు. ఇలా మొత్తంగా వారసులను రంగంలోకి దింపిన టీడీపీ హేమా హేమీలు ఓటమిని చూసి జీర్ణించుకోలేని పరిస్థితి
నెలకొనడం గమనార్హం.