యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో ఓట్ల సునామీ సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పోలైన ఓట్లలో సగం వరకు తన ఖాతాలో వేసుకుంది. విపక్షం కంటే చాలా దూరంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి మొత్తం 49.96 శాతం ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీ 39.2 శాతం ఓట్ల వద్ద ఆగిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. వ్యక్తిగతంగా తీసుకుంటే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి అత్యధికంగా 90,110 ఓట్ల మెజార్టీ రాగా, విజయవాడ నుంచి అదే పార్టీ తరపున గెలుపొందిన మల్లాది విష్ణుకు అత్యల్పంగా కేవలం 15 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇక మిగిలిన పార్టీల వారీగా చూసుకుంటే కాంగ్రెస్ 1.18 శాతం, బీజేపీ 0.84 శాతం, బీఎస్పీ 0.28 శాతం, నోటాకు 1.28 శాతం, ఇతరులకు 6.77 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో మూడో పార్టీగా బరిలోకి దిగిన జనసేన పార్టీ ఓట్ల షేర్‌ను ఇతరుల ఓట్లతో కలిపి చూపించారు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు అందిన వివరాల మేరకు ఈ సంఖ్యని వెబ్‌సైట్‌లో పెట్టారు.