యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తొడగొట్టి చెబుతున్నా.. గెలిచేది తెలుగు దేశమే. ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినా.. పసుపు జెండా ఎగరబోతోంది.. చంద్రబాబే మళ్లీ సీఎం.. టీడీపీకి 130 సీట్లు ఖాయం. ఇందులో ఎలాంటి అనుమానమే లేదు. ఫలితాలకు మూడు రోజుల ముందు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన హడావిడి. తోడలు కొట్టేస్తూ ఛాలెంజ్ చేసిన వెంకన్న.. వైసీపీకి సవాల్ విసిరారు. పాపం కౌంటింగ్‌లో మాత్రం సీన్ రివర్సయ్యింది. వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోయింది. తొడకొట్టడంపై బుద్దా వెంకన్న స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వెంకన్న.. ప్రజలు మార్పును ఆశించి జగన్‌ను గెలిపించారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. దురదృష్టం, ఊహించని పరాజయమన్నారు. చంద్రబాబు నాయుడుగారు దేవుడిలాంటి మనిషి.. రోజుకు 18 గంటల పనిచేసి సంక్షేమ పథకాలు అందజేశారన్నారు బుద్దా. మరీ 23 సీట్లతో సరిపెట్టడం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నానన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని అభిప్రాయపడ్డారు. జగన్‌కు, చంద్రబాబుకు ఓ తేడా ఉందంటున్నారు వెంకన్న. ‘జగన్‌కు చంద్రబాబుకు ఓ తేడా ఉంది. జగన్ ఓ అభ్యర్థి గెలవడంటే.. వెంటనే గెలిచే వ్యక్తిని పెట్టారు. అభ్యర్థుల్ని మార్చి.. గెలిచేవాళ్లకే సీటు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.. చంద్రబాబు మంచితనం, మొహమాటానికి పోయారు. ఎమ్మెల్యేలను మారిస్తే.. ఓడినా ఇంత ఘోర పరాజయం ఉండేదికాదు. చంద్రబాబు కూడా 50,60సీట్లు సిట్టింగ్‌లు మారుద్దామనుకున్నారు.. మొహమాటంతో మార్చలేకపోయారు. నా అంచనా తప్పయ్యింది.. పార్టీ కార్యకర్తలకు ఆత్మస్థైర్యం నింపడానికి తొడకొట్టా’అన్నారు వెంకన్న.