యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఒక పార్టీ నుంచి గెలిచి అధికారం కోసం మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఈ ఫిరాయింపులను పెద్ద ఘనకార్యంగా చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఎటువంటి లబ్ధిని ఆశించారో కానీ 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పోతూపోతూ తాము గెలిచిన పార్టీని, గెలిపించిన అధినేత జగన్ ను సైతం విమర్శించి పోయారు. ఇలా టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు తర్వాత మరణించారు. నలుగురు మంత్రులయ్యారు.గత ఎన్నికల్లో ఫిరాయించిన 21 మందిలో 16 మందికి తెలుగుదేశం పార్టీ మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. వీరికి ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడాన్ని ప్రజలు హర్షించలేదు. టిక్కెట్లు దక్కించుకున్న వారిలో కేవలం ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి గొట్టిపాటి రవి ఒక్కరే విజయం సాధించారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దారుణంగా ఓడిపోయారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు దక్కించుకున్న నలుగురు సైతం ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాల్లో బలమైన వారిగా గుర్తింపు ఉన్న వారు సైతం ఇప్పుడు ఓడిపోయారు. టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవులు దక్కించుకున్న అమర్ నాథ్ రెడ్డి పలమనేరులో, భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ సుజయకృష్ణా రంగారావు బొబ్బిలిలో, ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ స్థానంలో ఓడిపోయారు.ఇక, పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కించుకున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, కలమట వెంకటరమణ, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రూ, ముత్తముల అశోక్ రెడ్డి తదితరులు సైతం దారుణంగా ఓడిపోయారు. ఈ స్థానాల్లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ప్రజలు మళ్లీ గెలిపించారు. ప్రజల తీర్పును గమనిస్తే చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వకపోతే మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, డేవిడ్ రాజు, పరుపుల సుబ్బారావు వంటి వారు చివరికైనా సరైన నిర్ణయం తీసుకున్నారు..