YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేమెప్పుడూ ప్రజా పక్షమే: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ

మేమెప్పుడూ ప్రజా పక్షమే: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జిల్లా కేంద్రం కాకినాడలో జరిగిన ఓట్ల లెక్కింపులో భారీ మెజార్టీతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన ఆదిరెడ్డి భవానీ ఇంట విజయోత్సవాలు అంబరాన్నంటాయి. స్థానిక తిలక్‌ రోడ్డులోని ఆదిరెడ్డి ఇంట పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)లను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజా పక్షంలోనే ఉంటూ వారి సమస్యలపై
పోరాడుతుందన్నారు. తామెప్పుడూ ప్రజలతోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి తాను గెలుస్తానని ఊహించిన విధంగానే విజయం సాధించానన్నారు. అందుకు కారణంగా ప్రచారం సమయంలో ప్రజల నుంచి వచ్చిన ఆదరణ.... చూపించిన ప్రేమే తనకు ఘన విజయం సాధించి పెట్టాయన్నారు. తనకు ఇంతటి ఘన విజయం సాధించిన పెట్టిన నగర ప్రజలకు ఆదిరెడ్డి భవానీ కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. తాను గెలిచి పార్టీ అధికారంలోకి రాకపోవడం కాస్త బాధ అనిపించినా తాము మాత్రం ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి రాజమహేంద్రవరం కంచుకోటని, ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి సొంత ఎన్నికలుగా భావించి చేసిన కృషి కారణంగా ఇంతటి ఘన విజయం సాధించగలిగామన్నారు. అందరూ నిస్వార్ధంగా పని చేశారని అన్నారు. తన కుటుంబం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి పక్షంలో ఉన్నామా.... అధికార పక్షంలో ఉన్నామా అని భేరీజు వేసుకోకుండా నిత్యం ప్రజా పక్షం వైపు ఉంటామన్నారు. ఇదే తమకు తెలిసిన నీతన్నారు. అవకాశం ఎక్కడ ఉన్నా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.

Related Posts