ఇన్నాళ్లకు భారత క్రికెట్‌కు మరో కపిల్ దేవ్ దొరికాడంటూ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించిన వారు నేడు అతడిని తిట్టిపోస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకోవడమే అందుకు కారణం. కీలకమైన టెస్టులో ఆడుతున్నానన్న స్పృహ ఏమాత్రం లేకుండా అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. దీంతో నిన్నటి వరకు అతడిని అభిమానించిన వారు ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
తాజాగా కపిల్ దేవ్ కూడా స్పందించాడు. భవిష్యత్తులోనూ పాండ్యా ఇటువంటి తప్పులే చేస్తే ఇక తనతో పోల్చవద్దని అన్నాడు. అతడిలో చాలా ప్రతిభ ఉందని, అందుకు కేప్‌టౌన్ టెస్టులో అతడి ఆటతీరే నిదర్శనమన్నాడు. ఆ మ్యాచ్‌లో సహచరులందరూ వెనుదిరుగుతున్నా పాండ్యా మాత్రం క్రీజులో పాతుకుపోయి 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్జుకున్నాడు. కాగా, సెంచూరియన్ టెస్టులో లేని పరుగు కోసం యత్నించి ఘోరంగా ఔటయ్యాడు. బాధ్యతగా ఆడాల్సిన మ్యాచ్‌లో ఇలా చేయడం కరెక్టేనా అని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కపిల్ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ కూడా సమర్థించాడు. పాండ్యాను ఇప్పుడే కపిల్‌తో పోల్చడం సరికాదన్నాడు. కపిల్ 15 ఏళ్లు దేశానికి సేవలు అందిస్తే పాండ్యా ఆడింది కేవలం ఐదు టెస్టులేనని అన్నాడు. పాండ్యా క్షమించరాని తప్పు చేశాడని సునీల్ గవాస్కర్ ఇప్పటికే విరుచుకుపడ్డాడు.