యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నెట్ జన్లు 23 నెంబర్ ట్రోల్ అవుతోంది. 23 మంది ఎమ్మెల్యేలు...పార్టీ మార్చారు... టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు...23 వతేదీ ఎన్నికల ఫలితాలు... ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్న నెంబర్ 23...
తెలుగు గడ్డపై పాదయాత్రలు రాజకీయ నాయకులకు సెంటిమెంట్‌గా మారాయి. ఈ పాదయాత్రలు వాళ్లకు అధికార పీఠాన్ని అప్పగించే బ్రహ్మాస్త్రాలుగా మారిపోయాయి. గతంలో 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు దివంగత వైఎస్ చేపట్టిన పాదయాత్రే నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చింది. ఈ పాదయాత్ర తెలుగు రాజకీయ చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత 2004లో గెలిచిన వైఎస్.. ఆ తర్వాత 2009లో కూడా వైఎస్ రెండోసారి కాంగ్రెస్‌ను ఏపీలో అధికారంలోకి తీసుకు వచ్చి పెద్ద సంచలన రికార్డు క్రియేట్ చేశారు. ఏపీలో పాదయాత్రలు పార్టీలను అధికారంలోకి తీసుకు వస్తాయన్న సంప్రదాయానికి వైఎస్ నాంది పలికారు.ప్రజలతో మమేకం కావడానికి ప్రతిపక్ష పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రలు అధికార పీఠం ఎక్కిస్తాయన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో బలంగా ఉంది. ఇక వైఎస్ మృతి తర్వాత నాటి సమైక్య రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ రాజకీయ శూన్యత నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాల నేపథ్యంలో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. చివరకు పాదయాత్ర సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. రాష్ట్ర విభజన జరిగాక నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చింది… చంద్రబాబు ఏపీ తొలి సీఎం అయ్యారు.ఇక మధ్యలో వైసీపీ అధినేత వైఎస్.జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిల కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. తెలుగు రాజకీయాల్లో ఓ మహిళ అంత సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం ఓ రికార్డే. ఇక ఈ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రే నేడు జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైంది. 2017 నవంబర్ 6వ తేదీన జగన్ ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తం 341 రోజుల పాటు 3648 వేల కిలోమీటర్ల పాటు ఈ యాత్ర కొనసాగింది.ఈ యాత్ర ఈ యేడాది జనవరి 10న ముగిసింది.ఈ యాత్ర జాతీయ రాజకీయాల్లోనే పెద్ద సంచలనంగా మారింది. వైసీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి బలవంతంగా లాక్కోవడాన్ని నిరసించిన జగన్ అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి మరీ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రకు ఏపీలోని సామాన్య ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే జగన్ ఈ ఎన్నికల కోసం 2017 నుంచే శ్రీకారం చుట్టారు. పక్కా ప్లానింగ్‌తో జనాల్లోకి వెళ్లారు. గుంటూరులో వైసీపీ ప్లీనరి నిర్వహించి… నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను ప్రకటించారు. వీటిని ఆ పార్టీ నేతలు బలంగా జనాల్లోకి తీసుకువెళ్లారు. వీటితో పాటు ఒక్క ఛాన్స్ నినాదానికి ప్రజలు పట్టం కట్టినట్టు అర్థమైంది.