యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు అధిక ధరలకు వాటర్ ప్యాకెట్లను విక్రయిస్తూ... అధిక లాభాలు ఆర్జిస్తూ... నిలువునా దోచుకుంటున్నారు. ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మార్కెట్‌లో విచ్చలవిడిగా వాటర్ ప్యాకెట్లను విక్రయిస్తున్నారని వాపోతున్నారు. ఈ ప్యాకెట్లను తయారుచేసే కంపెనీలు తప్పనిసరిగా ఐఎస్‌ఐ సర్టిఫికెట్ పొంది ఉండాలి. పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో సర్టిఫికెట్లు ఉన్నా పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని నీటినే అందిస్తున్నారు. మంచినీటి ప్యాకెట్లు విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కొన్ని నియమ నిబంధనలు పెట్టినప్పటికీ వాటిని పక్కకునెట్టి తాగునీటిని విక్రయిస్తున్నారు. ఆల్ట్రా ఫిల్టరైజేషన్ ద్వారా నీటిలోని బ్యాక్టీరియాను తొలగించి, ఆ నీటిని ప్యాకింగ్ చేయాలి. నేడు కొంతమంది వ్యాపారులు లాభార్జనే నేరుగా విచ్చలవిడిగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. నీటిలో ఉన్న కరగని మలినాలు, లవణాలను తొలగించిన తర్వాత వాటిలో ఉన్న బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను నాశనం చేసిన తర్వాత ప్యాకింగ్ చేయాల్సి ఉండగా నేడు మార్కెట్‌లో లభించే మంచినీటి ప్యాకెట్లలో నీటిలో కరగని మలినాలు మాత్రమే తొలగించి విక్రయిస్తున్నారుదీనిపై అధికారులు స్పందించకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తయారీ కేంద్రం నుంచి 100 మంచినీటి ప్యాకెట్లు బస్తాను హోల్‌సేల్ డీలరుకు రూ.45 నుంచి రూ.50లకు విక్రయిస్తున్నారు. డీలరు నుంచి రిటైలర్‌కు రూ.60కు చేరవేస్తారు. రిటైలర్ మాత్రం ఒక్కొక్క ప్యాకెట్‌ను రూ.రెండు ధర చొప్పున విక్రయిస్తున్నారు. బస్తా వాటర్ ప్యాకెట్లను రూ.200లకు విక్రయించి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచినీటి ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ఏ ఒక్క వ్యాపారిపైనా చర్యలు తీసుకునే దాఖలాలు లేవని వినియోగదారులు వాపోతున్నారు. . నిత్యం లక్షలాది రూపాయలు టర్నోవర్ కలిగిన ఈ వ్యాపారంలో ఒక లీటరు తాగునీటిని తయారుచేయడానికి 30-40 పైసలు ఖర్చవుతుంది. దీన్ని నాలుగు ప్యాకెట్లుగా చేసి అరవై పైసలకు హోల్‌సేల్ వ్యాపారులకు అందిస్తారు. అక్కడ నుంచి దుకాణదారుడు మరో రూ.10 నుంచి రూ.15 వరకు అదనపు ధరలు వేసి కొనుగోలు చేస్తున్నాడు. దుకాణదారుడు ఒక్కొక్క వ్యాటర్ ప్యాకెట్‌ను రెండు రూపాయలకు విక్రయిస్తున్నాడు. రూపాయి విలువ చేసే మంచినీటి ప్యాకెట్‌ను రూ.రెండు రూపాయలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లను వారంలోగా వినియోగించుకోవాలని చెబుతూనే ప్యాకెట్‌పై తయారీ తేదీ ముద్రించకపోవడం శోచనీయం. వీటిపై సంబంధిత అధికారులు స్పందించి అధిక ధరలకు వాటర్ ప్యాకెట్లు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నాణ్యమైన నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.