యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన ఎన్నికల పెనుసునామీ.. అధికార టీడీపీకి శృంగభంగం చేస్తే.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీని ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో విజయాన్ని అందించారు. ఇది గెలుపు. మరో మాటలో చెప్పాలంటే.. ఇది వైసీపీ అధినేత జగన్‌కు అసాధరణ గెలుపు. అనేక ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని సాగించిన పోరులో సాధించిన విజయం. అయితే, ఈ గెలుపు కేవలం ఐదేళ్లకే పరిమితం..! మరి ఆ తర్వాత..? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉదయిస్తోంది. మేధావులు సైతం ఈ విషయంపైనే ఫోకస్ పెట్టారు. జగన్ గెలిచాడనేది ఎంత నిష్టూర సత్యమో.. ఈ గెలుపు వెనుక ఒక్క జగన్ కృషి మాత్రమే లేదు. అనేకానేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది అధికార పార్టీ ప్రతికూలతలు. అదే సమయంలో అనేక అంశాలు దాగి ఉన్నాయి. ఒక్క జగన్ వల్లే విజయం సాధించిన దానికంటే కూడా ప్రజల అధికార పార్టీ తో విసిగిపోయి జగన్‌కు అవకాశం ఇచ్చారనే వాదన బలపడుతోంది.రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞుడనే కారణంగా ఎటూ ఆలోచించకుండా చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. 102 సీట్లలో టీడీపీని గెలిపించారు. అయితే, ఇప్పుడు అదే ప్రజలు కనీసం దీనిలో సగం సీట్లలో కూడా టీడీపీని కరుణించలేదు. దీనికి కారణం ఏంటి? ఎన్నికలకు కేవలం రెండు మాసాలు ముందు పింఛన్లను 50% పెంచారు చంద్రబాబు. అదే సమయంలో మహిళా ఓట్లను ఆకట్టుకునేందుకు పసుపు కుంకుమ పథకం కింద రూ.10 వేల చొప్పున వారికి నజరానా సమర్పించుకున్నారు. రుణమాఫీ చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద అనేక సాయాలు ప్రకటించి నిధులు విడుదల కూడా చేశారు. అంతే కాదు, వంగి వంగి దండాలు కూడా పెట్టారు. నన్ను చూసి ఓటేయండి! అంటూ ప్రజలను బతిమాలారు. అయినా కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాన్ని బట్టి ప్రజలు బాబు విజ్ఞప్తిన పట్టించుకోలేదనే విషయం స్పష్టంగా
కనిపిస్తోంది.నిజానికి ఈ ఏడాది జనవరి వరకు కూడా అభివృద్ధి, సంక్షేమం, విజన్ వంటివి తనను గెలిపిస్తాయని, ముందుకు తీసుకువెళ్తాయని, తిరిగి తన ప్రభుత్వం చేయడం ఖాయమని చంద్రబాబు చెబుతూ వచ్చారు. అంతేకాదు, తాను గెలవకపోతే, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆగిపోతుందని, రౌడీలు రాజ్యం చేస్తారని, దొంగతనాలు పెరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు తీరా ఫలితాలు వచ్చాక ఇవేమీ పనిచేయలేదని స్పష్టంగా కనిపించింది. కట్ చేస్తే.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 30 ఏళ్లపాటు అధికారాన్ని నిలబెట్టుకుంటానన్న జగన్‌కు ఇప్పుడు ప్రజలు ఆరచేతిలో విజయాన్ని అదికూడా కనీవినీ ఎరుగని మెజారిటీని కట్టబెట్టారు.మరి దీని నుంచి జగన్ నేర్వాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. తన అనుచరులను, టీంను సరైన మార్టంలో నడిపించాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది. అదే విధంగా అక్రమాలకు, లంచాలకు దూరంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఒక, మాఫియా సంస్కృతిని కూకటి వేళ్లతో పెకలించాల్సిన కర్తవ్యం కూడా ఉంది. ఇదే టీడీపీని నిలువునా ముంచాయి. ఇప్పుడు వైసీపీ కూడా వీటిని అణచకపోతే.. ఇప్పుడు దక్కిన విజయం కేవలం ఐదేళ్లకే పరిమితమవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మరి జగన్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.