యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఎవరూ ఊహించని విధంగా దూసుకుపోయారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల ను కూడా తోసిపుచ్చి మరీ జగన్ విజయదుందుభి మోగించారు.. వైసీపీ
విజయం సాధించింది. దీనిని బట్టి.. టీడీపీ పూర్తిగా చతికిల పడిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబుకు కనీసం ప్రతిపక్ష హోదా కూడాదక్కని పరిస్థితి నెలకొంది. ఆయన పలుమార్లు చెప్పినట్టు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న చంద్రబాబు. ఇప్పుడు ఇదే పరిస్థితి తనకు ఎదురుకావడం జీర్ణించుకోలేని విషయం. జగన్ విషయానికి వస్తే.. ఆయన విజయాన్ని అందరూ అంగీకరించి తీరాల్సిందే. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అంతే పెద్ద ఎన్నికల వ్యవస్థలో ఉన్న మనం.. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరించి తీరాల్సిందే అన్న తొలి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యల సాక్షిగా.. ప్రజలు ఇచ్చిన తాజా తీర్పును ఎంత కష్టమైనా.. ఇబ్బందిగానే ఉన్నా.. టీడీపీ అంగీకరించా ల్సిందే. అదేసమయంలో ఈ తీర్పుతో జగన్ గెలిచినట్టే.. అంటే మాత్రం పప్పులో కాలేసి నట్టే అంటున్నారు మేధావులు. ఇక్కడ అనేక విషయాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఎక్కడ ప్రజలకు బాధకలిగిందో ఆ బాధను తప్పించుకునేందుకు ఆ పాలనను కాదనుకుని మరీ జగన్‌కు ప్రయోజనం కట్టబెట్టారు.ఇప్పుడు రాబోయే ఐదేళ్లు కూడా జగన్ ప్రజలకు సేవచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేసమయంలో ప్రధానమైన ప్రాజెక్టులు పోలవరం, రాజధాని నిర్మాణం, పారిశ్రామికంగా, ఐటీ పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనే విషయాల్లో జగన్ తన విజన్‌ను నిరూపించుకోవాలి. బాబు కన్నా నాలుగు అడుగులు ఎక్కువగా ఆయన దూకుడు ప్రదర్శిస్తేనే తప్ప.. ఇప్పుడు వచ్చిన ఎన్నికల సునామీని నిలబెట్టుకునే అవకాశం లేదు. అదేసమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించుకోవాలి. ప్రత్యేక హోదా విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టకపోయినా.. మెజారిటీ ప్రజల ఆకాంక్ష అయిన దీనిపైనా జగన్ ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప.. సాధించిన దానికి సంతృప్తితి చెందితే.. ప్రజలు తమ మార్పును వెనక్కితీసుకునే ప్రమాదం కూడా ఉందన్న విషయాన్ని గుర్తించాలి. మరి జగన్ ఎలా అడుగులు వేస్తారో చూడాలి.