యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో జత కట్టడం ఆయన చేసిన వ్యూహాత్మక తప్పిదంగా జనం భావించారు. అదే పార్టీతో జాతీయ స్థాయిలో అంటకాగడం మోదీని వ్యతిరేకించే ప్రతి పార్టీనీ అక్కున చేర్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మోదీ పట్ల తనకున్న వ్యతిరేకతను చాటుకోడానికే మళ్లీ ఆయనను అధికారంలోకి రాకుండా చేయడానికే మహాకూటమి పేరిట చంద్రబాబు అహరహం శ్రమించినా కూడా ఆయనకు జనామోదం లభించలేదు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయానే్న టీడీపీ చవిచూడడం వెనుక ఈ రాజకీయ చాణక్యుడి వ్యూహాత్మక తప్పిదాలే కారణమన్నది విశ్లేషకుల భావన. రాజకీయ వ్యూహకర్త, ఎదుటి వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తుచేయగలిగే రాజకీయ
చాణక్యం ఆయన సొంతం. ఎలాంటి రాజకీయ సవాల్‌నైనా ఆనుపానులు తెలుసుకుని పరిష్కరించగలి నేర్పరితనం కూడా చంద్రబాబుదే. రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఎన్టీఆర్ అనంతరం తెలుగుదేశం అంటే చంద్రబాబే అన్న బలమైన నమ్మకం ఆ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ విభజన అనంతర ఏపీలోనూ ఇన్నాళ్లూ నిలబెట్టింది. మరో ప్రత్యర్థేలేని ధీమా తెలుగుదేశం పార్టీదేనన్న భావన పటాపంచలైంది. తాజా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కలలోకూడా ఊహించని రీతిలో ప్రజలు తీర్పునిచ్చారు. సంక్షేమ పథకాలు, పసుపుకుంకుమ ఇలా ఒకటేమిటి అనేక రకాలుగా ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ తాజా ఎన్నికల్లో విజయాన్ని సునాయాసం చేసుకోవాలన్న చంద్రబాబు ఆశలు ఫలించలేదు. లోక్‌సభ ఎన్నికల్లోనూ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్‌ఆర్‌సీపీకి చారిత్రక రీతిలో జనం పట్టం గట్టడం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునాదులను కుదిపేసింది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అలాగే బీజేపీతో ఒక దశలో స్నేహం మరోదశలో వైరం రాష్ట్ర ప్రజలకు ఆయన రాజకీయ నిబద్ధత పట్లే అనుమానాలకు ఆస్కారం కలిగించాయి. రెండోసారి కూడా నరేంద్రమోదీకి అధికారం తథ్యం అన్న సంకేతాలు ఎప్పుడైతే బలపడ్డాయో జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక వర్గాలు ఒకే తాటిపైకి తెచ్చేందుకు చివరి క్షణం వరకూ చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు ఎంతైనా ఆస్కారం ఉందని వీవీ ప్యాట్ స్లిప్పులతో పోలైన ఓట్లను సరిపోల్చాలన్న డిమాండ్‌తో అన్ని ప్రతిపక్ష పార్టీలను ఆయన ఒకే తాటిపైకి తేగలిగారు. కానీ తాజా ఎన్నికల్లో జనం ఇచ్చిన తీర్పు ఓ ప్రభంజనం గానే మారడం, జగన్మోహన్‌రెడ్డికి ఊహించని రీతిలో చారిత్రక విజయం చేకూరడం, అలాగే కేంద్రంలో నరేంద్రమోదీ రెండోసారి కూడా తిరుగులేని మెజారిటీతో అందలం ఎక్కడంతో చంద్రబాబు వ్యూహాలన్నీ బెడిసికొట్టేశాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయి, లోక్‌సభ స్థానాలకు సంబంధించి చంద్రబాబుకు నిర్వేదాన్ని మిగిల్చిన ఈ తాజా
ఎన్నికల ఫలితాలు ఆయన తాజా రాజకీయ వ్యూహాన్ని ఏ విధంగా నిర్దేశిస్తాయో వేచి చూడాల్సిందే