యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమితో ఆ పార్టీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. ఆయా నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసిన నేతల ఇళ్లన్నీ బోసిపోయాయి. చాలామంది నేతలు తమ కార్యకర్తలకు మొహం చూపించడానికి వెనకాడుతున్నారు. ఓటమి కలిగించిన నిరుత్సాహంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 23న వెలువడిన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయానని ఇంట్లో కూర్చుకుండా బోడె ప్రసాద్ మూడోరోజే ప్రజల్లోకి వచ్చారు. పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై ఒంటరిగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ఓటేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఏమైనా తప్పుచేస్తే క్షమించాలని కోరారు. తనకు ఓటేసిన వారికి, ఓటేయని వారికి కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు.