YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ రాజీనామా తిరస్కరించిన సిడబ్ల్యూసీ

 రాహుల్ రాజీనామా తిరస్కరించిన సిడబ్ల్యూసీ

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:     

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలనలో మునిగితేలుతోంది. ఇప్పటికే పలువురు పీసీసీ చీఫ్ లు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు సీనియర్లు హాజరైన ఈ సమావేశంలో ఓటమికి కారణాలపై చర్చించారు.ముఖ్యంగా, రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరవైఫల్యానికి కారణం తనదేనని చెప్పారు. అందుకే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ రాజీనామాను తిరస్కరించింది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోవడం పట్ల తనదే నైతిక బాధ్యత అని రాహుల్ మరోసారి చెప్పగా, సీడబ్ల్యూసీ సభ్యులు రాహుల్ ను అనునయించారు.2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చత్తీస్‌గఢ్‌లో ఒక్క సీటును, మధ్యప్రదేశ్‌లో రెండు సీట్లను అతి కష్టం మీద దక్కించుకోగలిగింది. ఆ తర్వాత, అంటే 2018లో ఈ మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పాలకపక్ష బీజేపీని ఓడించి అధికారంలోకి రాగలగింది. దాంతో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. ఈసారి ఈ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కనీసం సగం సీట్లు దక్కించుకోవచ్చని ఆశపడింది. రాష్ట్ర ప్రభుత్వాల అండతో ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అయినా ఏ మాత్రం మెరుగైన ఫలితాలను సాధించలేక పోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిసి
2014లో మూడు సీట్లే రాగా, ఇప్పుడు మూడు సీట్లే వచ్చాయి. గత ఎన్నికల్లోలాగే ఈ ఎన్నికల్లో కూడా రాజస్థాన్‌లో ఒక్క సీటంటే ఒక్క సీటు రాలేదు. చత్తీస్‌గఢ్‌లో గతంలో ఒక్క సీటు రాగా ఈ
సారి రెండు సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో గతంలో రెండు సీట్లు రాగా, ఈ సారి ఒక్క సీటు వచ్చింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహామహులు
ఓడిపోయారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్‌ సింగ్, అజయ్‌ సింగ్, వివేక్‌ టన్ఖా, కాంతిలాల్‌ భురియా, అరుణ్‌ యాదవ్‌లు ఓడిపోయారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌ తన తండ్రి ఎంపీ నియోజకవర్గమైన ఛింద్వారా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అది కూడా తక్కువ మెజారిటీతోనే. ఇక రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ కూడా ఓడి పోయారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియాను, రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ను ముఖ్యమంత్రులను చేయాలని గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం యువ కాంగ్రెస్‌ నాయకుల నుంచి డిమాండ్‌ వచ్చింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పలు ఎంపీ సీట్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నందున సీనియర్లకు నాయకత్వం అప్పగించక తప్పడం లేదని నాడు కాంగ్రెస్‌ అధిష్టానం వాదించింది. మరి ఇప్పుడు ఏమైందీ ? ఎందుకు ఈ ఘోర పరాజయం ఎదురైందీ?

Related Posts