యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి కి అఖండ విజయం లభించడంతో జగన్ క్యాబినెట్ లో బెర్త్ ఎవరికీ అన్న చర్చ మొదలైంది. ఈ జిల్లానుంచి సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్ర బోస్ గెలిచి ఉంటే ఆయనకు తొలి ప్రాధాన్యతను జగన్ ఇచ్చేవారు. అయితే బోస్ ఓటమి చెందడంతో ఇప్పుడు అందరి చూపు జిల్లా వైసిపి అధ్యక్షుడు కురసాల కన్నబాబు పైనే వుంది. సౌమ్యుడు గా పార్టీలో అందరితో సఖ్యతగా వుండే కన్నబాబును ఉన్నత స్థానం కల్పిస్తానని ఎన్నికల ప్రచారంలో సైతం జగన్ మాటిచ్చిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజిక వర్గం నుంచి గెలిచిన వ్యక్తి కావడం తో బాటు రెండుసార్లు ఎమ్యెల్యేగా గెలిచిన వ్యక్తి కావడం శాసన సభ వ్యవహారాలపై అనుభవం, సీనియర్ పాత్రికేయుడిగా మీడియా పై పూర్తి అవగాహన వున్న వ్యక్తిగా పార్టీ గుర్తిస్తున్న నేపథ్యంలో ఆయనకే టిక్ పెట్టె ఛాన్స్ లు అధికంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్.వివాదరహితుడిగా ఉండే కన్నబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో గట్టిగా విరుచుకుపడ్డారు. ఆయనకు ఎమ్యెల్యే పదవి తన అన్న పెట్టిన బిక్ష అంటూ, స్కూటర్ పై తిరిగే సాధారణ జర్నలిస్ట్ ఇప్పుడు కోట్లకు పడగలు ఎత్తారంటూ.. దుమ్మెత్తిపోశారు జనసేనాని. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కారణమైన వారిలో కన్నబాబు కూడా ఒకరంటూ ఫైర్ అయ్యారు పవన్. తన పార్టీలో చేరకపోవడం తో పవన్ కన్నబాబు పై కన్నెర్రజేసి ఎడాపెడా విమర్శలు ఆరోపణలు గుప్పించారు. పైపెచ్చు పవన్ ఈ ఆరోపణలు ఒక్క కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే కాదు అనేక ప్రచార సభల్లో ప్రస్తావించారు.పవన్ కళ్యాణ్ తనను టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చారు కన్నబాబు. పవన్ చేసిన ఆరోపణలకు ధీటుగా సమాధానాలు ఇవ్వడమే కాక జనసేన అధినేతపై ప్రశ్నల వర్షం కురిపించారు. మెగాస్టార్ తనకు అన్నగా ఉంటే బెంజ్ కారులో తిరిగేవాడినని…
అన్న పేరులేకుండా పవన్ ఎక్కడ..? అంటూ కడిగిపారేశారు. ఇలా పవన్ పై దూకుడుగా వెళ్ళి జనసేన అస్థిత్వాన్నే ప్రశ్నించి హీరో అయ్యారు కన్నబాబు. వైసిపి, జనసేన ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వడంతో ఇక్కడ టిడిపి సిట్టింగ్ ఎమ్యెల్యే పిల్లి అనంతలక్ష్మి విజయం మరోసారి ఖాయమని అంతా లెక్కేసినా పవన్ కళ్యాణ్ ను కన్నబాబు ఢీకొన్న తీరే ఆయన్ను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో హీరోను చేసి గెలిపించిందని ఎన్నికల ఫలితం ద్వారా ప్రజలు తేల్చడం విశేషం. కన్నబాబును పవన్ లక్ష్యంగా చేసుకోవడం అయినా కానీ భిన్నమైన నియోజకవర్గంలో ఆయన నెగ్గుకు రావడం వైఎస్ జగన్ కి అత్యంత ఇష్టుడు కావడం కూడా కలిసివచ్చే అంశాలు కానున్నాయి. ఈ నేపథ్యంలో కన్నబాబుకు క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నది పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.