యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వరుస విజయాలు సాధించి మండపేట టిడిపి సిట్టింగ్ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వర రావు హ్యాట్రిక్ నమోదు చేశారు. 2009 , 2014, 2019 లలో ఆయన టిడిపి నుంచి గెలుస్తూ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. పోల్ మేనేజ్ మెంట్ లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు జోగేశ్వర రావు. గతంలో 2009 ఎన్నికల్లో వైఎస్ సర్కార్ కాంగ్రెస్ గాలికి ఎదురు నిలిచి గెలవగా తాజాగా వైసిపి తుఫాన్ ను తట్టుకుని తన సత్తా చాటారు జోగేశ్వర రావు. తనదైన వ్యూహంతో బాటు అనేక కారణాలు వేగుళ్ల విజయానికి రీజన్స్ అవుతూ రావడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటను టిడిపి ఖిల్లాగా మార్చిన జోగేశ్వర రావు వరుస విజయలవెనుక ఆయన స్వయం కృషే కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.జోగేశ్వర రావు నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటారు. ఆయన అసెంబ్లీలో కానీ సభలు సమావేశాల్లో కానీ పెద్దగా మాట్లాడింది ఎప్పుడు ఉండదు. మీడియాలో కూడా కనిపించరు. తన పని తాను చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి పనులు నిధులను ప్రభుత్వం నుంచి తేవడంలో లాబీయింగ్ లో దిట్ట. ఇసుక దందాలో ఆయన పేరు వినిపించినా రోడ్లు, డ్రైయిన్ల విషయంలో కాంట్రాక్టర్ల దగ్గర కక్కుర్తి పడి క్వాలిటీ లేని పనులు చేయించేందుకు అంగీకరించక పోవడం వల్ల పెద్దగా అవినీతి మరకలు అంటకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ ఘట్టంలో ఆయనతో జిల్లాలోనే ఎవ్వరు పోటీ పడలేరనే టాక్ వుంది.శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా వుండే మండపేట నియోజక వర్గంలో ఎలాగయినా గెలిచి తీరాలని వైసిపి రూపొందించిన వ్యూహాన్ని వేగుళ్ల తిప్పికొట్టారు. మాజీ మంత్రి ఎప్పుడు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే పిల్లి సుభాష్ చంద్ర బోస్ ను మండపేట నుంచి బరిలోకి దింపారు జగన్. ఏ పార్టీ అభ్యర్థి అయినా కమ్మ సామాజిక వర్గం నుంచే అభ్యర్థులను రంగంలో నిలిపే సంప్రదాయాన్ని వైసిపి
ఈసారి ఇక్కడ బ్రేక్ చేసింది. అత్యధిక సంఖ్యాకులు బోస్ సామాజిక వర్గం ఉన్నా వేగుళ్ల ధన ప్రవాహం ముందు ఈ ఎత్తుగడలు ఏమి పనిచేయక పోవడం విశేషం. ప్రచారం మొదలు పెట్టిన నాటినుంచి పిల్లి బోస్ వెనుక ఎవరు వున్నా వారికి గాలం వేసి వ్యూహాత్మకంగా తన ప్రత్యర్థిని దెబ్బకొట్టారు జోగేశ్వర రావు. గెలుపు కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ వెళ్లడంతో రాజకీయ యోధుడు బోస్ ను వేగుళ్ల మట్టికరిపించి విజయాన్ని సొంతం చేసుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.