యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆరంభించింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఊరుకుని ఆఖరు నిమిషంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆయన శ్రీకారం చుట్టారు. దేశం అంతటా పార్లమెంటు ఎన్నికలు, ఏపిలో అయితే పార్లమెంటుతో బాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న రోజులవి. అనుకున్న షెడ్యూల్ కాస్త ఆలస్యం అయింది కానీ లేకపోతే ఈ పాటికి ఒకే సామాజిక వర్గం ఆ పోస్టుల్లో తిష్టవేసుకుని కూర్చుండేది. ఏపిపిఎస్‌సి ద్వారా వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇదే తప్పు కాదు కదా అని ఎవరైనా అనవచ్చు. తప్పు కాదు. పైగా మంచిది కూడా. అయితే పరీక్షలు నిర్వహించిన విధానం, ఆ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రాలు, లీక్‌లు, మార్కులు ప్రకటించిన విధానంపైనే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఎన్నికల హడావుడిలో ఉండగా ఎవరూ ఈ పరీక్షల గురించి పట్టించుకోరనే ధైర్యంతో అన్నీ తప్పులే చేసేసినట్లు అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎంతో హడావుడిగా గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పరీక్షలు ఎంతో హడావుడిగా నిర్వహించేశారు. కొన్నింటికి ఫలితాలు ప్రకటించేశారు. మరికొన్నింటికి మార్కులను అభ్యర్ధులకు నేరుగా పంపిచేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగిన ఈ అన్ని రాత పరీక్షల్లో స్క్రీనింగ్ పరీక్షల్లో రాజకీయ ప్రమేయం చోటు చేసుకుందని ఒకే సామాజిక వర్గం అభ్యర్ధులకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ పరీక్షా పత్రాలను కొందరు ముందే అస్మదీయులకు లీక్ చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. అంతే కాకుండా ఈ పరీక్షలన్నీ బబ్లింగ్ విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో ఆన్సర్ షీట్లను మార్చడం అత్యంత సులభం. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఏపిపిఎస్‌సి ద్వారా జరిగిన పరీక్షల్లో ఈ కుంభకోణం జరిగిందని నిన్న మొన్న అందుకున్న మార్కుల ద్వారా అభ్యర్ధులకు అవగతం అయింది.ఈ అభ్యర్ధులకు నేరుగా సర్వీస్ కమిషన్ మార్కులను పంపించడం ఆ మార్కులను చూసిన అభ్యర్ధులు తలలు పట్టుకోవడం జరిగింది. ఏప్రిల్ 11న రాష్ట్ర శాసనసభకు పోలింగ్ ఉంటే ఏప్రిల్ 25న పరీక్ష ఎలా పెడతారు? అనేది ప్రధాన ప్రశ్న. నెలరోజులలోపునే వాల్యుయేషన్ పూర్తి చేసి అంత హడావుడిగా ఎందుకు అభ్యర్ధులకు మార్కులను అందచేశారు? అంటే దీని వెనకాల రాజకీయ వత్తిడులు ఉన్నట్లే కదా? 30న కొత్త ప్రభుత్వం వస్తున్న దృష్ట్యా ఈ అభ్యర్ధుల ఎంపికలలో కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదనే దురుద్దేశ్యం ఇందులో ఉన్నట్లు కనిపిస్తున్నది. తాము ఎంపిక చేసిన అభ్యర్ధులే సెలక్టు అవ్వాలనే దురాలోచనతోనే ఇది చేశారని అభ్యర్ధులు అనుకుంటున్నారు. ముఖ్యంగా బిసి ఎస్ సి ఎస్ టి మైనారిటీ అభ్యర్ధులతో బాటు ఓసి కోటాలోని ఒక్క సామాజిక వర్గం మినహా అందరూ ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరడం గమనార్హం.దీనిపై కోర్టుకు వెళతామని అలాగే సమాచార హక్కు చట్టం కింద మొత్తం వ్యవహారాన్ని బయటకు లాగుతామని అభ్యర్ధులు అంటున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలో జరిగిన అన్ని రకాల పోస్టుల భర్తీకి నిర్వహించిన అర్‌అత పరీక్షలను (ప్రిలిమ్స్)ను రద్దు చేయాలని మళ్లీ
కొత్త ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ ఈ ఎస్ ఎల్ నర్సింహన్ ఇందులో తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్ధులు ఇప్పటికే ఆయనకు అభ్యర్ధనలు పంపారు. లేకపోతే అత్యంత కీలకమైన ఈ పోస్టులలోకి అనర్హులు వచ్చి చేరే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.