యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి(తితిదే) సమావేశం మంగళవారం జరగనుంది. ఈ మేరకు దేవస్థానం బోర్డు సెల్ నుంచి సభ్యులకు ఫోన్ల ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి. తితిదే నియమావళి
ప్రకారం ఇప్పటికే సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నందున ఈ నెల 28కి వాయిదా పడింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తెదేపా ప్రభుత్వం నియమించిన పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలోని ధర్మకర్తల మండలి ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు.. మరో ఏడాది కొనసాగాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వం అధికారం కోల్పోయిన నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై సందిగ్ధం నెలకొంది. అయితే ధర్మకర్తల మండలి శ్రీవారి సేవలో ఉన్నందున సెంటిమెంట్ దృష్ట్యా సభ్యులు రాజీనామా చేయడానికి ఇష్టపడడం లేదు. తమ భవితవ్యాన్ని కొత్త ప్రభుత్వ నిర్ణయానికే వదిలేయాలని భావిస్తున్నారు