బాంబ్ తుపాన్ సృష్టించిన బీభత్సం నుంచి అమెరికా ఇంకా కోలుకోనే లేదు. అంతలోనే మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. మంచు తుపాన్ ముప్పు పొంచి ఉండటంతో అనేక రాష్ట్రాలు వణికిపోతున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే తూర్పు తీరంలో భారీ హిమపాతం నమోదవుతోంది. మొన్నటికి మొన్న బాంబ్ తుపాన్ అమెరికాలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. తూర్పు, ఈశాన్య, రాష్ట్రాలు గడ్డకట్టుకుపోయాయి. భారీ ఆస్తినష్టం సంభవించింది. అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ బీభత్సాన్ని మరువక ముందే ఇప్పుడు మరో తుపాను తరుముకొస్తోంది.
దీని ప్రభావంతో ఇప్పటికే తీర్పు తీరంలో భారీగా మంచు కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన చలి వణికిస్తోంది. న్యూ ఇంగ్లండ్‌లో 12 అంగుళాల మేర మంచు మేటలు వేసింది. ఇక న్యూహాంప్‌షైర్, వెర్మాంట్, మైనా ప్రాంతాలు చలికి గడ్డకట్టుకుపోతున్నాయి. అగ్నేయ టెక్సాస్ నుంచి పశ్చిమ పశ్చిమ మాసాచుసెట్స్ మార్గంలో రోడ్లపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది. మిసిసిపి, ఉత్తర కరోలినాలో రోడ్లపై 10 అంగుళాల మేర మంచు మేటలు వేసింది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.
అనేక ప్రాంతాల్లో మైసన్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జాక్సన్, మిస్ ప్రాంతాల్లో గత 21 ఏళ్లలో తొలలిసారి సాధారణం కంటే 10 డిగ్రీలల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హూస్టన్‌లో సాధారణం కన్నా 20 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డల్సాలో మైనస్ 15 డిగ్రీలు, బర్మింగ్‌హామ్‌లో మైసస్ 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు వల్ల అమెరికా ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ ఉమ్మడిగా 1200 విమానాలను రద్దు చేశాయి. 650 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అటు మంచు ప్రభావం న్యూయార్క్‌నూ తాకింది. అనేక ప్రాంతాల్లో భారీ హిమపాతం నమోదవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో శీతాకాలంలో వెంటవెంటనే రెండు తుపానులు దాడి చేయడం ఇదే మొదటిసారి. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.