YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప జిల్లాల్లో ఇంటర్ విద్య అంతా మిధ్య

 కడప జిల్లాల్లో ఇంటర్ విద్య అంతా మిధ్య

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కడప జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్య అధ్వాన స్థితికి చేరుకుంది. ప్రభుత్వ యాజమాన్య జూనియర్‌ కళాశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించి గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఏ మాత్రం అడుగులు వేయకపోవడంతో వాటి తీవ్రత మరింతగా కళ్లకు కడుతోంది. ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు తగినంతగా చేయకపోవడం, మౌలిక వసతుల కల్పన దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం, సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయకపోవడం వారి ప్రేక్షకపాత్రకు అద్దంపడుతోందని విమర్శలు వినవస్తున్నాయి. జూన్‌ 1వ తేదీ నుంచి జూనియర్‌ కళాశాలలు పునః ప్రారంభం కానున్నందున ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సకాలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ మొదలు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కల్పన వరకు తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది.కడప జిల్లాలో 167 జూనియర్‌ కళాశాలలు ఉండగా వాటిలో  26 మాత్రమే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏటా సుమారు 35 వేల మందికి పైబడి పదో తరగతి పరీక్షలు రాస్తుండగా వారిలో దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా చిట్టచివరి స్థానంలో ఉంది..తల్లిదండ్రుల ఆలోచనల్లో వస్తున్న మార్పుల కారణంగానూ అంతమంది జిల్లా వదిలి వెళ్లిపోతున్నారు. మిగిలిన విద్యార్థులను 98 కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలతో పోటీపడి 26 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఆకర్షించగలుగుతున్నది ఎనిమిది వేల మంది విద్యార్థులను. వారిలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు  కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలోనే చేరుతుండటం గమనార్హం. 20 వేల మందికిపైబడి విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసిస్తుండగా అగ్రభాగం కార్పొరేట్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలు తరలించుకుంటుండగా పరిస్థితుల్లో మార్పు కోసం ఒక్కటంటే ఒక్క పకడ్బందీ చర్య చేపట్టిన దాఖలాలు ప్రభుత్వం నుంచి లేదంటే దాని వెనుక ఉద్ధేశాన్ని, చిత్తశుద్ధిని గమనించవచ్చు.  జిల్లాలోని 26 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 268 జూనియర్‌ అధ్యాపకుల మంజూరు పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్‌ ప్రాతిపదికన 139 మంది, ఒప్పంద ప్రాతిపదికన 198 మంది మొత్తంగా 337 మంది జూనియర్‌ అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేంటి మంజూరు పోస్టులు 268 కాగా 337 మంది పనిచేయడమేంటి అనుకుంటున్నారా..!! చక్రాయపేట, పెనగలూరు, రాయచోటి (బాలికలు), రాజంపేట (ఉర్దూ), మైదుకూరు (ఉర్దూ), ప్రొద్దుటూరు (ఉర్దూ) మొత్తంగా జిల్లావ్యాప్తంగా ఈ ఆరు జూనియర్‌ కళాశాలల్లో ఒక్కటంటే ఒక్క జూనియర్‌ అధ్యాపకుడి పోస్టు మంజూరు పోస్టుగా లేదు. అంటే ఒక్క మంజూరు పోస్టు కూడా లేకుండానే లక్షల రూపాయలు వెచ్చించి ఆయా జూనియర్‌ కళాశాలలను నిర్మించి ప్రారంభించేశారు. అందులోనూ మైదుకూరు (ఉర్దూ), రాజంపేట (ఉర్దూ) జూనియర్‌ కళాశాలలకు ప్రిన్సిపల్‌ పోస్టులు కూడా మంజూరు పోస్టులు కాదు. 268 మంజూరు జూనియర్‌ అధ్యాపకుల మంజూరు పోస్టుల స్థానంలో 139 మంది రెగ్యులర్‌ సేవలు వినియోగించుకుంటూ మొత్తంగా 198 ఒప్పంద జూనియర్‌ అధ్యాపకుల సేవలను వినియోగించుకుంటున్నారు. అదీ లెక్క.జిల్లా వ్యాప్తంగా 26 ప్రభుత్వ, 20 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు గతేడాది ప్రథమ సంవత్సరానికి  43,000 పాఠ్య పుస్తకాలు రాగా అందులో 34,397 పంపిణీ చేయగా 8,603 మిగిలాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 31,800 పాఠ్య పుస్తకాలు జిల్లాకు రాగా 27,422 పంపిణీ చేయగా 4378 మిగిలాయి. అధికారిక లెక్కల ప్రకారం పాఠ్య పుస్తకాలు మిగులుగా దర్శనమిస్తుండగా 2017-18 విద్యా సంవత్సరానికి అవి జిల్లాకు చేరింది డిసెంబరు నెలలో. కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో అప్పటికి సిలబస్‌ సైతం పూర్తయి ఉంటుంది. పాలకులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు తీరిక చేసుకుని ఆ సమయానికి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయగలిగారు మరి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 35,445, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 38,130 పాఠ్య పుస్తకాలు పంపిణీకి అవసరమవుతాయని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రథమ ఇంటర్‌ పుస్తకాల్లో పాఠ్యాంశాలు ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులు పూర్తిగా, భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితంలో ఒకటి, రెండు పాఠ్యాంశాలు అదనంగా చేర్చి మారనుండటం, ఇప్పటి వరకూ పుస్తకాల ముద్రణ, సరఫరా ప్రక్రియపై స్పష్టత కానరాకపోవడంతో ఎప్పటికి పుస్తకాల పంపిణీ జరుగుతుందోనన్న ఆందోళన శాఖలో కనిపిస్తోంది.

Related Posts