యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రభుత్వాలు మారినప్పుల్లా ప్రజలకు అందే పథకాల పేర్లు మారడం సహజంగానే జరుగుతుంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే... వారికి అనుకూలమైన నేతల పేర్లను ప్రభుత్వ అమలు చేసే పథకాలకు పెట్టుకోవడం కామనైపోయింది. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. పథకాలు అవే అయినా... వాటి పేర్లు మార్చి కొత్తగా ప్రచారం చేసుకోవడం ఆయా పార్టీల స్టయిల్. తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు పేర్లు మార్చే అవకాశం లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటీన్ పేరు మీద రాజన్న క్యాంటీన్ అనే పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఎక్కడిది... ఇది నిజంగా వైసీపీ కార్యకర్తల పనేనా అనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ... ఏపీలో ప్రభుత్వం మారడంతో అన్న క్యాంటీన్ పేరు మారుతుందా అనే చర్చ మొదలైంది. మరోవైపు తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ హామీ ఇచ్చిన విధంగా నవరత్నాలు పథకాలను అమలు చేస్తామని వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో... అన్న క్యాంటీన్‌ను కొనసాగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది