యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆ వైసీపీ నేతకు గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా పరాజయాలే పలకరిస్తున్నాయి. ఎప్పుడో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి టైంలో ఓ సారి ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత జగన్‌ను నమ్మి జగన్ వెంటే నడుస్తూ వచ్చారు. ఎట్టకేలకు జిల్లా మారి ఇప్పుడు మళ్లీ లోక్‌సభలో అడుగు పెడుతున్నారు. ఇంతకు ఆ వైసీపీ నేత ఎవరో కాదు మచిలీపట్నం నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన వల్లభనేని బాలశౌరి. 2004లో నాటి దివంగత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అండదండలతో తెనాలి ఎంపీగా పోటీ చేసిన బాలశౌరి విజయం సాధించారు.2009 ఎన్నికల్లో పునర్విభజనలో తెనాలి ఎంపీ సీటు రద్దయ్యింది. దీంతో వైఎస్ బాలశౌరిని గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. అయితే అప్పుడు గుంటూరు ఎంపీగా ఉన్న రాయపాటిని తప్పించేందుకు సోనియాగాంధీ ఇష్టపడలేదు. చివరకు బాలశౌరికి నరసారావుపేట సీటు ఇవ్వగా ఆ ఎన్నికల్లో ఆయనపై నాటి టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గెలిచారు. ఇక జగన్ గత ఎన్నికల్లో బాలశౌరికి గుంటూరు ఎంపీ సీటు కేటాయించారు.
ఎలాగైనా గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలవాలన్న బాలశౌరి గత ఎన్నికల్లో అక్కడ మరోసారి ఓడిపోయారు. బాలశౌరిపై టీడీపీ నుంచి పోటీ చేసిన గల్లా జయదేవ్ గెలిచారు. ఓ రకంగా ఈ ఎన్నికల్లో అసలు బాలశౌరి పోటీ చేస్తారా ? ఆయనకు జగన్ సీటు ఇస్తారా ? అన్న సందేహాలు కూడా వచ్చాయి. మచిలీపట్నం ఎంపీగా వంగవీటి రాధాను పోటీ చేయించాలని కూడా జగన్ అనుకున్నారు. రాధా టీడీపీలో చేరిపోవడంతో చివరకు బాలశౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.గుంటూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు తెనాలి – నరసారావుపేట – గుంటూరు నుంచి పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలిచిన బాలశౌరిని అక్కడ ప్రజలు రెండుసార్లు తిరస్కరించారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన జిల్లా మారడంతో తన రాత కూడా మారింది. మచిలీపట్నం ప్రజలు ఆయనకు బ్రహ్మాండమైన మెజార్టీతో ఘనవిజయం కట్టబెట్టారు. ఇలా బాలశౌరి జిల్లా మారి తన ఫేట్ మార్చుకున్నారు.