యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కేంద్ర ప్రభుత్వం 2016-17లో ‘అనంత’ను ‘అమృత్’ పథకం కింద ఎంపిక చేసినా.. ఆ స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగడం లేదు. పాలకుల వర్గ విభేదాల నేపథ్యంలో ప్రగతి పడకేసింది. ‘అమృత్ సిటీ’గా అనంతను అభివృద్ధి చేయడానికి నగరపాలక సంస్థకు రూ.50 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అమృత్ పథకం కింద నిధులు మంజూరైనప్పుడు పాలకవర్గం గొప్పలు చెప్పుకుంది. ఆ తర్వాత నిధుల వ్యయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ నిధుల్లో రూ.50 లక్షలతో బుద్ధవిహార్ పార్క్ అభివృద్ధి, రూ.18 కోట్లతో వరద నీటి కాలువల నిర్మాణం, రూ.17 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్, రూ.10 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మరమ్మతు, రూ.50 లక్షలతో రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటికి పరిపాలనా అనుమతి మంజూరైనా.. సాంకేతిక (టెక్నికల్) అనుమతి మాత్రం రాలేదు. పాలకవర్గంలోని గ్రూపు రాజకీయాలే ఇందుకు కారణం. ఎమ్మెల్యే, మేయర్ వర్గీయులు తరచూ వివాదాలను లేవనెత్తుతున్నారు. వారు ఏనాడూ ‘అమృత్’ పరిస్థితేంటని ఆలోచించిన దాఖలాలు లేవు. ఇంతకుముందు నగర పాలక సంస్థకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం, ‘అమృత్’ పనులకు సంబంధించి ప్రత్యేకంగా డీఈ, ఏఈ లేకపోవడం కూడా పనులు సాగకపోవడానికి కారణాలు. ప్రస్తుతం ఏపీఎఫ్‌ఐయూడీసీ నుంచి నియమితులైన సిటీ ప్లానర్ హిమబిందు, ఎక్స్‌పర్ట్ రోజారెడ్డి, కన్సల్టెంట్ ఆయూబ్ పర్యవేక్షిస్తున్నారు.వీటిని వరద నీటి కాలువలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్, నీటి సరఫరా, పార్కుల అభివృద్ధికి వినియోగించుకోవాలి. ఈ పనులకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేశారు. పరిపాలనా పరమైన అనుమతి కూడా మంజూరైంది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రభుత్వం ఇటీవల వీటి నిర్వహణ బాధ్యతను పబ్లిక్ హెల్త్‌కు అప్పగిస్తూ జీఓ విడుదల చేసింది. అమృత్’ పనులు పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వరద నీటి కాలువలు ఏర్పాటైతే ఏళ్ల తరబడి వెంటాడుతున్న మరువ వంక సమస్య తీరుతుంది. అశోక్‌నగర్ బ్రిడ్జి నుంచి ఐరన్ బ్రిడ్జి మీదుగా సూర్యనగర్ సర్కిల్, త్రివేణి టాకీస్, ఎర్రనేల కొట్టాలు, తడకలేరు వరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మరువ వంకకు భవిష్యత్తులో వరద వచ్చినా ఎటువంటి ప్రమాదమూ ఉండదు. అలాగే శిల్పారామంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. నడిమివంక, మరువ వంక ద్వారా వచ్చే మురుగు నీటిని ఇందులో శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వినియోగించడంతో పాటు తడకలేరు వద్ద ఉన్న డ్యాంలోకి పంపుతారు. దీంతో పాటుగా నీటి సరఫరాకు సంబంధించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. స్టోరేజీ ట్యాంకులో బండ్‌కు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ట్రీట్‌మెంట్ ప్లాంట్ కూడా సరిగా లేదు. దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేస్తే ప్రజలకు శుద్ధి జలాన్ని అందించవచ్చు.