యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నారా ఫ్యామిలీని తోసి నందమూరి కుటుంబసభ్యులు ఎవరైనా ముందుకు వచ్చి టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తీరిగ్గా సినిమాలు అన్నీ పూర్తి చేసుకొని రాజకీయాల్లోకి వస్తానంటే కుదురదని, అప్పటి వరకూ వేచి చూస్తే అసలు టీడీపీ పార్టీ అనేదే ఉండదని అన్నారు. అలాగే నారా కుటుంబం చేతిలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. కొంత మంది భజనపరులు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు బతికించారని, భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నారని అంటుంటారు. అయితే అవన్నీ అవాస్తవమని అన్నారు. కేవలం ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీ భారీ విజయాలు నమోదు చేసిందని, బాబు హయాంలో పార్టీ నానాటికీ దిగజారుతూ వచ్చిందని అన్నారు. 2004,2009 ఎన్నికల్లో టీడీపీ బాగా బలహీన పడిందని, 2014 ఎన్నికల్లో కేవలం స్వల్ప మెజారిటీతో మాత్రమే గట్టెక్కిందని అన్నారు. అలాగే తెలంగాణలో అయితే కనీసం ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని సైతం నిలబెట్టలేని స్థితికి దిగజార్చారని అన్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన ఘోర పరాజయం నుంచి టీడీపీ బతికి బట్టకట్టకపోతే, ఆ స్థానంలో బీజేపీ కానీ, జనసేన కానీ వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా నందమూరి కుటుంబం కళ్లు తెరిచి టీడీపీ పార్టీని స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ తనకు స్నేహితుడని, రాజకీయాల గురించి ఎప్పుడూ చర్చించలేదన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కు సినిమాల్లో హీరోగా మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ, రాజకీయాలకు దూరంగా ఉంటానంటే కుదరదని
అన్నారు. వీలైనంత త్వరగా నందమూరి కుటుంబసభ్యులు ఎవరైనా పార్టీ పగ్గాలు చేపడితేనే టీడీపీ మిగులుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నందమూరి కుటుంబానికి ఆప్తుడు. అలాగే హరికృష్ణకు చాలా సన్నిహితుడు, గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సాంబా, అదుర్స్ చిత్రాలకు కొడాలి నాని ప్రొడ్యూసర్గా సైతం వ్యవహరించారు.