యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ప్రపంచ కప్ క్రికెట్.. నాలుగేళ్ళకోసారి ఇటు అభిమానుల్నీ.. అటు క్రికెటర్లనీ ఊరిస్తుంది. అభిమానులు తమ అభిమాన జట్టు కప్పు గెలవాలని కళ్ళు ఆర్పకుండా టీవీలకు అతుక్కుపోతారు. క్రికెటర్లు ప్రపంచమంతా మనవేపు చూస్తోంది.. ఈ టోర్నీలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోవాలని వువ్విళ్ళూరుతారు. ఇంకో మూడు రోజుల్లో వరల్డ్ కప్ సంబరం మొదలవ బోతోంది. ఈసారి కొందరు ఆటగాళ్ళపై అభిమానులకు చాలా అంచనాలున్నాయి. వాళ్ళు రికార్డులు సృష్టిస్తారని ఎదురుచూస్తున్నారు. అందరూ ఓ కన్నేసి చూడాల్సిన ఆట తీరున్న క్రికెటర్లు వీరు..
విరాట్‌కోహ్లీ (టీమిండియా) బ్యాటు పట్టుకుంటే శతకం అతనికి దాసోహమైపోతుంది. వన్డేల్లో పరుగుల రారాజు అతనే. టీమిండియా కెప్టెన్ గా.. సచిన్ రికార్డులకు వారసుడిగా నిలిచిన కోహ్లీ పై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు చాలా ఆశలే ఉన్నాయి. చేదనలో ప్రపంచంలోనే అత్యుత్తమ గణాంకాలు కోహ్లీ సొంతం. ఛేదనలో ఎంతటి లక్ష్యాన్నయినా కోహ్లీ ఉంటేచాలు ఇండియా గెలిచినట్టే. ఒంటి చేత్తో ఛేదనలో మ్యాచును గెలిపించే సత్తా కోహ్లీకే సాధ్యమైన విద్య. అందుకు ఛేదనలో భారత్ సాధించిన విజయాలు.. ఆ విజయాల్లో కోహ్లీ సాధించిన శతకాలే సాక్ష్యం. ఇపుడు వరల్డ్ కప్ లో కోహ్లీ రికార్డులను ఎన్నిటిని లేక్కేసుకోవాలో..
జస్ప్రిత్ బుమ్రా (టీమిండియా) పేస్ బౌలింగ్ లో ఎపుడూ వెనుకబడి ఉండే భారత జట్టుకు బుమ్రా ఓ వరం. ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లలో ప్రస్తుతం బుమ్రాకు మంచి స్థానం ఉంది. కగిసో రబాడా,
మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ వంటి మేటి బౌలర్లకు దీటుగా బంతులేయగల సత్తా అతడి సొంతం. అవతలి పక్క బ్యాట్స్ మెన్ ఎంత ఊపు మీద ఉన్నా.. బుమ్రా బౌలింగ్ లో ఆచి తూచి ఆడాల్సిందే.
ఇటు పరుగులకూ.. అటు వికెట్ కాపాడుకోవడానికి శ్రమించాల్సిందే. పదునైన యార్కర్లు బుమ్రా ప్రధాన బలం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రాను ఎదుర్కోవడం ప్రస్తుతం ప్రపంచంలోని
ఆటగాల్లందరికీ సవాలే! డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా) ఏడాది పాటు బాల్ టాంపరింగ్ వ్యవహారంలో క్రికెట్ కు దూరమైన డేవిడ్ వార్నర్ ఇపుడు ఆస్ట్రేలియా జట్టులో చేరాడు. ఇటీవలి ఐపీఎల్ లో 12 మ్యాచుల్లో 692 పరుగులు చేసి తన ఫాం సూపర్ అని నిరూపించాడు. వార్నర్ స్ట్రైక్ రేట్ ఈ ఐపీల్ లో 96.55. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వార్నర్ ఫాం ఎలా ఉందో..
ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్) ఊచకోత అంటే ఏమిటో రసెల్ బ్యాటింగ్ చూస్తే తెలుస్తుంది. బౌలర్ కి బాల్ ఎక్కడ వేయాలో తెలీని విధంగా చేయగల దిట్ట రసెల్. విధ్వంసానికి ప్రతిరూపంగా క్రిస్ గేల్ ను
చెప్పుకునే వాళ్లు. ఇపుడు కథ మారింది రసెల్ బ్యాటింగ్ విధ్వంశానికి మించి ఉంటుంది. ఈ ఐపీఎల్ లో ఆడిన 14 మ్యాచ్ లలో 52 సిక్సులు కొట్టి ఒంటి చేత్తో కొలకత్తా కు విజయాలు సాధించి పెట్టాడు. అన్నట్టు ఇతను బౌలింగ్ లోనూ రాణించే సత్తా కూడా ఉంది. సో.. ఈ ఆల్రౌండర్ ను ఎదుర్కోవడానికి ప్రత్యేక ఆలోచన వరల్డ్ కప్ లో ప్రతి జట్టూ చేయాల్సిందే!
రషీద్‌ఖాన్ (అఫ్గానిస్థాన్) ప్రపంచ కప్ లో చిన్న జట్టుకు పెద్ద అండ రషీద్ ఖాన్. స్పిన్ మాయాజాలంతో ఎటువంటి బ్యాట్స్ మెన్ ను అయినా బోల్తా కొట్టించగలడు. వన్డేల్లో కేవలం 59 మ్యాచులాడిన ఈ బౌలింగ్ సంచలనం 125 వికెట్లు సాధించింది. నాలుగు సార్లు నాలుగు వికెట్లు.. నాలుగుసార్లు ఐదు వికెట్లు తీశాడు. తన తొలి వరల్డ్ కప్ ఆడుతున్న రషీద్ పై ఆఫ్ఘనిస్తాన్ చాలా ఆశలు పెట్టుకుంది.
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) బలంగా బంతిని బౌండరీ దాటించే సత్తా ఉన్న ఆటగాళ్ళ లో మొదటి వరుసలో బట్లర్ ఉంటాడు. లక్ష్యం నిర్దేసించాలన్నా.. ఛేదించాలన్నా బట్లర్ బరిలో ఉంటె చాలు. పాకిస్తాన్ తో జరిగిన వన్డే లో 50 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ క్రికెట్ కు తానూ ఉన్నాను జాగ్రత్త అనే సందేశాన్ని పంపించాడు. పాక్ కోచ్ బట్లర్ బ్యాటింగ్ చేస్తుంటే అదుపు చేయడం ఎలాగో అర్థం కాలేదు అన్నాడంటే ఇతని బ్యాటింగ్ గురించి తెలుసుకోవచ్చు