శ్రీకాకుళం: జిల్లాలో ప్రతి నెలా లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తున్నారు. ఒకటి నుంచి అయిదో తేదీలోగా పింఛన్ల నిధులు పంపిణీ చేస్తున్నారు. 90-95 శాతం మంది మాత్రమే పింఛన్లు తీసుకుంటున్నారు. మృతులు, అందుబాటులో లేని వారు, వలస దారులకు సంబంధించిన పింఛన్ల నిధులు తిరిగి డీఆర్‌డీఏకు జమ చేయాలి. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. మృతుల పేరుతో నిధులు దోచేస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. ఈ నిధులన్నీ పక్కతోవ పట్టించి జేబులు నింపేసుకొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 3,49,081 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. వీరికి పంపిణీ చేసేందుకు నెలకు రూ. 70 కోట్లకు పైగా నిధులు అవసరమవుతోంది. కొన్నేళ్లుగా మిగులు నిధులు పక్కదోవ పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సామాజిక తనిఖీల్లో ఇవి బట్టబయలవుతున్నాయి. రికవరీకి సైతం అధికారులు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకున్న దాఖలాలు ఉండటం లేదు. అరకొరగా జమ చేసి చేతులు దులిపేసుకొంటున్నారు. పూర్తిస్థాయిలో నిఘా ఉంటే ఆరంభంలోనే వీటిని పసిగట్టే వీలుంటుంది.
గతంలో పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీల్లో తేలింది. బాధ్యుతల నుంచి నిధులు రికవరీ చేయాలి. ఈమేరకు అధికారులు ఆదేశాలూ జారీ చేశారు. అయితే తిరిగి రికవరీ చేసిన నిధులు కొంతే. గత రెండేళ్లలోనే వసూలు కావాల్సిన సొమ్ములు రూ.లక్షల్లో ఉన్నాయి. గత జనవరి నుంచి ఇంత వరకు ఒక్క సంతకవిటి మండలంలోనే రూ. 19 లక్షలకు పైగా పింఛన్ల మిగులు నిధుల లెక్కలు తేలాల్సి ఉందని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. దీనిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగారు. ఈ నిధుల రికవరీకి చర్యలు చేపడుతున్నారు.