యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. పార్టీ కార్యాలంలో తెదేపా జెండా ఎగురవేసిన చంద్రబాబు నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాసేవలో తనకు స్ఫూర్తినిచ్చిన మార్గదర్శకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఎన్టీఆర్ ఓ శక్తి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తున్నానని, ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవుదామని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంక్షేమం-అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేయలేదన్నారు. నాలుగు రోజులుగా ఎంతో మంది తన దగ్గరికొచ్చి బాధపడ్డారన్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేసుకుందాం. కార్యకర్తలు చెప్పే వాటిని విని ముందుకు సాగుదాం. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి బాధ్యతగల ప్రతి పక్షంగా పని చేద్దాం. ఎవరి స్దాయిలో వారు సమీక్ష చేసుకోని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఇకపై ప్రతిరోజు గుంటూరు కార్యాలయానికి వస్తానని చెప్పారు. రోజూ 3గంటల పాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.