యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి 5వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుతో పాటు హైదరాబాద్, చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 5 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ కాన్వాయ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గాన్ని నిర్దేశించారు. ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం ఏఆర్ మైదానాన్ని, అధికారులు, సిబ్బంది, సహాయకుల వాహనాల పార్కింగ్ కోసం బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల, స్టేట్ గెస్ట్హౌస్లను కేటాయించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీ వాహనాలను మళ్లించాలని పోలీసులు నిర్ణయించారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు 30న కృష్ణాజిల్లా హనుమాన్జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట, ఖమ్మం జిల్లా వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే వాహనాలు హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే.. హైదరాబాద్, కంచికచర్ల, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా కూడా విశాఖపట్టణం చేరుకోవచ్చు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు గుంటూరు, తెనాలి, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, అడవినెక్కలం, మేదరమెట్ల, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అడవినెక్కలం, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.