నెల్లూరు: స్థిరాస్తి వ్యాపారులు అనధికార వ్యాపారాలు సాగిస్తూనే ఉన్నారు. స్థిరాస్తి నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా దాని పరిధిలోకి వెళ్లని వ్యాపారులు ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి, అపార్ట్‌మెంట్‌లు నిర్మించి అమ్మేస్తున్నారు. ఇదంతా పట్టని అధికారులు చట్టం అమలుపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకపోగా.. వినియోగదారులు నష్టపోతున్నారు. 2017 మార్చి నుంచి ఏపీలో రేరా (స్థిరాస్తి వ్యాపార నియంత్రణ ప్రాధికార సంస్థ) చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వ్యాపారులు లొసుగులు వెతుక్కుని ప్రాజెక్టులు నమోదు చేసుకోవడం లేదు. వీటిపై అవగాహన లేక వినియోగదారులు ఫిర్యాదు చేయడం లేదు.
న్యూస్‌టుడే, పెళ్లకూరు: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద 7 దరఖాస్తులు రాగా వాటిల్లో 4 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. మరో మూడు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో పట్టణాల పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 1,600 అనధికార లేఅవుట్‌లు ఉన్నట్లు గతంలో గుర్తించారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త వెంచర్లతోపాటు అంతకు ముందు ప్రాజెక్టులు రేరాలో నమోదు చేసుకోవాల్సి ఉంది. కాదని వ్యాపార లావాదేవీలు చేసే వారిపై భారీ జరిమానాలు విధించేందుకు రేరా చట్టంలో వీలు కల్పించారు. తాజాగా సమావేశమైన పాలకమండలి చట్టం అమలుపై చర్చించింది. రేరా పరిధిలో నమోదు కాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని అందుకు నిర్ణయించిన ఫీజులు చెల్లించాలని హెచ్చరించింది. కాదంటే నూరుశాతం జరిమానా విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లో వినియోగదారుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని రేరా నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చింది. దీన్ని మన రాష్ట్రంలో 2017 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో వినియోగదారుల హక్కులకు పెద్దపీట వేశారు. వ్యాపారులు వేసే వెంచర్లు, నివాసాలు, వ్యాపార భవనాలు, అపార్ట్‌మెంట్ భవనాల నిర్మాణాలు ఇలా విభాగాల వారీగా నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇదంతా ఆన్‌లైన్ ద్వారా వ్యాపారులు దరఖాస్తు చేసుకొంటే పరిశీలించి యంత్రాంగం అనుమతులు ఇస్తోంది. స్థిరాస్తి ఏజెంట్లు కూడా ఇందులో నమోదు కావచ్ఛు వినియోగదారుల సమస్యలు ఇక్కడ పరిష్కరిస్తారు. ఇలా పలు రకాలుగా వ్యాపారులు, వినియోగదారుల మధ్య వారధిగా దీనిని ఏర్పాటు చేశారు. స్థిరాస్తి విక్రయాల్లో గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంత పెద్దఎత్తున విక్రయాలు సాగుతున్నాయి. అనధికారికంగా లేఅవుట్లు వేస్తున్న వ్యాపారులు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వెంచర్లు వేసే వారు డీటీసీపీ నిబంధనలు పాటించాల్సి ఉంది. ప్రజా ప్రయోజనాలకు స్థలం వదిలిపెట్టాల్సి ఉంది. నిబంధనల మేరకు రహదారుల ఏర్పాటుతో పాటు విద్యుత్తు, వీధి దీపాలు అమర్చాల్సి ఉంటుంది. నీటి సదుపాయం
కల్పించాల్సి ఉంది. ఇవన్నీ కాదని ఇష్టమొచ్చినట్లు ప్లాట్‌లు వేసి విక్రయించేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లలో కూడా ఇదే పరిస్థితి. నిబంధనలకు అనుగుణంగా కాకుండా తక్కువ వ్యయంతో నిర్మించి మిన్నకుంటున్నారు. రేరా చట్టం పరిధిలో నమోదు చేసుకునే సంస్థలు, వ్యాపారులు, ఏజెంట్లు వారి వెంచర్ల వివరాలు పక్కాగా ఇవ్వాల్సి ఉంది. భవంతులు నిర్మించేవారు వారి స్కెచ్‌లు, నిర్మాణంలో వాడే సామగ్రి తదితర వివరాల నివేదిక ఇవ్వాల్సి ఉంది. వినియోగదారులకు నమ్మకం కలిగించేందుకు నిర్మాణ ప్రాంతంలో వర్చువల్ రియాల్టీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటి పరిధిలో నిర్మాణాలు పక్కాగా సాగాల్సి ఉంది. ఇక్కడ ఏ మోతాదులో సామగ్రి వాడుతున్నారో తెలుసుకొనేందుకు వినియోగదారుడికి వీలు కలుగుతుంది.