తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్ ను రాజకీయ రంగంలో ఏ నాయకుడితో పోల్చలేమని,ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తితో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి విజయం చేకూరే వరకు అవిశ్రాంతంగా పని చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జెకె గార్డెన్స్ లో జయంతి వేడుకలు, మహానాడు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆదిరెడ్డి భవానీ ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ నా విజయానికి అందరూ కృషి చేశారని, కచ్చితంగా అందరిని ఒక కుటుంబ సభ్యులుగా భావించి పని చేస్తానన్నారు.ఓటమితో కృంగిపోయే పార్టీ తెలుగుదేశం కాదని, ఎన్టీఆర్ పోరాట స్పూర్తితో పార్టీని బలపరుద్దామని పిలుపునిచ్చారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ నభూతో న భవిష్యత్ అన్నట్లు ఇటువంటి మహానుభావుడు ఈ గడ్డపై పుట్టాడా అని అనిపించేలా ఎన్టీఆర్ జీవితం ఉందని,సిని రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి గొప్ప నటుడిగా నిలిచారన్నారు.ఎన్టీఆర్ నటనా చాతుర్యం ఆంధ్రప్రదేశ్ కే రిమితమవుతుందని,ప్రపంచ వ్యాప్తంగా తీసిలుకెళ్లాలని సిఎస్ రావు అన్న మాటలు గుర్తు చేశారు. లవకుశ సినిమా ఆనాడు భారీ బడ్జెట్ చిత్రం నిర్మించారని, ఆనాటి వారి కష్టం ఈనాడు ఏ సినిమాతో పోల్చలేమని అన్నారు. సినిమాలో జీవించి పాత్రలో ఒదిగిపోయేవారని అన్నారు. ఎన్టీఆర్ తో పోల్చదగిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరని అన్నారు.పార్టీ జెండాని నిలబెట్టడం కోసం మాత్రమే చంద్రబాబు వ్యతిరేకించారని,కోపంతోనో, ద్వేషంతోనో కాదన్నారు. చంద్రబాబు అలా నిర్ణయం తీసుకోవడం వలనే తెలుగుదేశం పార్టీ నేటికి రెపరెపలాడుతుందన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను వక్రీకరిస్తే సహించబోమన్నారు. ఓటమి శాశ్వతం కాదని, గెలిచిన వాడికి గర్వం, ఓటమి చెందిన వాడికి
బాధ అవసరం లేదన్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, అందరూ సంఘటితంగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింప చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అధికారమదంతో కాల్చి వేయడం, కొన్నిచోట్ల కార్యకర్తలను హింసించడం వంటి దుశ్చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల జోలికి దయచేసి రావద్దని, వస్తే వైఎస్సార్ విగ్రహాల జోలికి తాము వెళ్ళవలసి ఉంటుందన్నారు.