యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అత్యాచారాలు జరగడానికి అమ్మాయిల వస్త్రాధరణ, వారి వ్యవహార శైలి మాత్రమే కారణం కాదని.. మృగాళ్ల పశువాంఛే కారణమని గుజరాత్‌లో జరిగిన ఓ ఘటన నిరూపించింది. అహ్మదాబాద్‌లో 75 ఏళ్ల యాచకురాలిపై అత్యాచారం చేసిన ఓ దుర్మార్గుడు... ఆమెను విచక్షణారహితంగా కొట్టి రోడ్డు పక్కన, నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్లాడు. మర్మావయవాల నుంచి, ఎడమ కంటి నుంచి రక్తం కారుతోన్న స్థితిలో ఆమెను గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో సమీపంలోని అసర్వా సివిల్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. చిక్కి శల్యమైన శరీరం, 40 కేజీల బరువు, నోట్లో దంతాలు కూడా లేని ఆ పెద్దావిడను చూస్తే.. జాలేస్తుంది. కానీ అలాంటి దీన స్థితిలో ఉన్న వృద్ధురాలిని చిత్రహింసలకు గురి చేసిన దుర్మార్గుడు.. ఆమెను రేప్ చేశాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిందెవరో తెలుసుకోవడానికి స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రేప్ ఘటనతో బెదిరిపోయిన ఆ వృద్ధురాలు.. నన్ను అత్యాచారం చేశారు, నన్ను అత్యాచారం చేశారని పదే పదే చెబుతోంది. పోలీసులు ధైర్యం చెప్పడంతో.. కాస్త తేరుకున్న ఆమె.. తనది వడ్గాం ప్రాంతమని, ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి తనను గొయ్యిలోకి ఈడ్చుకెళ్లాడని.. మర్మావయవాలు, ఎడమ కన్ను దగ్గర విచక్షణారహితంగా కొట్టి.. రేప్ చేశాడని వాపోయింది. ఖొడియార్ మాతా ఆలయం దగ్గర్లో ఈ ఘటన జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.