యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పుగోదావరి జిల్లా శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం రత్నగిరిపై దేవదాయ ధర్మదాయ శాఖ నిబంధనల ప్రకారం జూలై 1వ తేదీ నుంచి స్వామివారి సేవల్లో పాల్గొనే భక్తులు హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించేలా (డ్రెస్‌కోడ్) నియమాలను అమలుపరిచేలా దేవస్థాన విధానాలను ప్రవేశపెడుతున్నామని దేవస్థానం ఈవో ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. ఇకపై రత్నగిరికి వచ్చే భక్తులు సత్యదేవుని వ్రతం, దర్శనం, హోమాలు, పూజలతోపాటు తదితర దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే భక్తులు పురుషులైతే పంచె, ధోవతి, ఉత్తరీయం, మహిళలైతే చీర, జాకెట్, పంజాబీ డ్రెస్‌లతో కూడిన సంప్రదాయ దుస్తులతోనే పాల్గొనాలని ఈవో సూచించారు. ఈనిబంధనను జూలై 1వ తేదీ నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని, సంప్రదాయ దుస్తులు ధరించనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారి సేవల్లో (కార్యక్రమాల్లో)గానీ, దర్శనానికి గానీ అనుమతించేది లేదన్నారు. అదేవిధంగా రత్నగిరిపై దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వసతి సౌకర్యం కోసం (గది) అద్దెకు తీసుకున్నప్పుడు సీఆర్వో (సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్)లో దరఖాస్తు పూర్తిచేసి దానికి ఆధార్‌కార్డు జెరాక్స్ జతపరిచి బయోమెట్రిక్ (వేలిముద్ర) ద్వారా గది అద్దెకు తీసుకోవాలని ఈవో తెలిపారు. గది ఖాళీ చేసేటప్పుడు కూడా అదే వ్యక్తి మరలా బయోమెట్రిక్ ద్వారా మాత్రమే గది ఖాళీ చేసి డిపాజిట్ తిరిగి పొందేలా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామని ఈవో తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం ముందుగా రూమ్ బుక్ (రిజర్వేషన్) చేసుకునే రోజుల్లో సమయాన్ని మధ్యాహ్నం 2గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 2గంటల వరకు కేటాయించినట్టు తెలిపారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే కార్తీక మాసంలో భక్తులు గది అద్దెకు తీసుకున్న సమయం నుంచి 12 గంటలు మాత్రమే వినియోగించుకుని గది ఖాళీ చేసేలా నిబంధనలను రూపొందిస్తున్నట్టు ఈవో తెలిపారు. సత్యదేవుని దర్శనం కోసం గుడిలోకి వెళ్లే భక్తుల వెంట ఎటువంటి లగేజీగానీ, సెల్‌ఫోన్లనుగానీ జూన్ 1వ తేదీ నుంచి అనుమతించేది లేదన్నారు. భక్తులకు అనుకూలంగా ఉండేలా రత్నగిరిపై తూర్పు, పడమర రాజగోపురాల సమీపంలో క్లాక్ రూములు సిద్ధం చేస్తున్నామన్నారు. హిందూ సనాతన సాంప్రదాయ ధర్మాన్ని కాపాడే చర్యల్లో భాగంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఈ విషయాలను రత్నగిరికి వచ్చే భక్తులంతా గమనించి సహకరించాలని కోరారు