యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మహారాష్ట్ర …దేశంలోని పశ్చిమ రాష్ట్రాల్లో ఒకటి. సంపన్న రాష్ట్రం. 80 లోక్ సభ స్థానాలు గల ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలతో రాజకీయంగా రెండో అతి పెద్ద రాష్ట్రం. రాష్ట్ర రాజధాని ముంబయి, దేశ వాణిజ్య రాజధాని నగరం కూడా. జాతీయ పార్టీలు ఎంత బలమైనవో, ప్రాంతీయ పార్టీలు కూడా రాష్ట్రంలో అంతే కీలకం కావడం విశేషం. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా ఏ జాతీయ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నది వాస్తవం. ఇన్ని ప్రత్యేకతల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎన్నికల తీరుతెన్నులను దేశ్యవ్యాప్తంగా అందరూ గమనించారు. ఇంతటి విస్తృత నేపథ్యంలో జరిగిన సార్వత్రికఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ – శివసేన కూటమి ఘన విజయం సాధించింది. 2014 నాటి పట్టును నిలుపుకుంది. మొత్తం 48 స్థానాల్లో బీజేపీ 23 స్థానాలను కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లోనూ పార్టీ 23 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. మిత్రపక్షమైన శివసేన కూడా 18 స్థానాలను సాధించింది.గత ఎన్నికల్లోనూ 18 స్థానాలను సాధించడం తెలిసిందే. హస్తం పార్టీతో జట్టుకట్టిన శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈసారి మెరుగైన ఫలితాలను సాధిస్తామన్న ఉభయపార్టీల అంచనాలు విఫలమయ్యాయి. 2014 లో నాలుగు స్థానాలను గెలుచుకున్న ఎన్సీపీ ఈసారి వాటిని కాపాడుకుంది. గతంలో రెండుస్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి ఒక్కస్థానానికేపరిమితమైంది. ఇతర పార్టీలు రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ సారథ్యంలోని బహుజన్ మహాసంఘ్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. 25 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 23, 23 స్థానాల్లో పోటీ చేసిన శివసేన 18 స్థానాల్లో విజయం సాధించింది. 26 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. 22 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన ఎన్సీపీ నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలె సొంత నియోజకవర్గం బారామతి నుంచి విజయం సాధించారు. అదే సమయంలో పవార్ సోదరుడు మనవడు పార్థ్ పవార్ కూడా మావల్ స్థానంలో పరాజయం పాలయ్యారు.రాష్ట్రంలోని ఔరంగాబాద్ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకోవడం విశేషం. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం ఇప్పటికీ తెలంగాణకే పరిమితమయింది. తాజాగా ఔరంగాబాద్ స్థానంలో పాగా వేయడం ద్వారా తన పరిధిని విస్తరించుకుంది. ఎంఐఎం అభ్యర్థి ఇమ్తియాత్ జలీల్ శివసేన అభ్యర్థి చంద్రకాంత్ భైర్ పై విజయం సాధించారు. జలీల్ కు 3.89 లక్షలు ఓట్లు రాగా చంద్రకాంత్ కు 3.84 లక్షల ఓట్లు వచ్చాయి. 2009, 2014 ఎన్నికల్లో శివసేన ఇక్కడ విజయం సాధించింది. ఈ లోక్ సభ స్థానం పరిధిలో ఔరంగాబాద్ సెంట్రల్, ఔరంగాబాద్ వెస్ట్, ఔరంగాబాద్ ఈస్ట్, కన్నడ్, గంగాపూర్, వైజపూర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎంఐఎం విజయం సాధించడం శివసేనకు ఎంతమాత్రం రుచించని పరిణామమేనని చెప్పక తప్పదు.ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ – శివసేన పొత్తుపై సందిగ్దత నెలకొంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామి అయినప్పటికీ రెండు ప్రభుత్వంపై శివసేన విమర్శలతో విరుచుకుపడేది. అలా అని ప్రభుత్వం నుంచి వైదొలగేది కాదు. ఒక దశలో విమర్శలు శృతి మించాయి. ఎన్డీఏ నుంచి శివసేన వైదొలుగుతుందని భావించారు. వైదొలగడం వల్ల కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని మహారాష్ట్ర బీజేపీ సర్కార్ కు ముప్పు
తప్పదు. శివసేన మద్దతుపైనే ఆయన ప్రభుత్వం ఆధారపడి ఉంది. చివరి రోజుల్లో పరిస్థితి మారింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దౌత్యంతో ఒక కొలిక్కి వచ్చింది. మససు మార్చుకున్న శివసేన పొత్తుకు సిద్ధమయింది. విడిపోతే కలిగే నష్టాలపై ఉభయ పార్టీలకూ అవగాహన ఉంది. అందుకే విభేదాలకు చరమగీతం పాడి ఒకే బాటలో నడిచాయి. ఉత్తమ ఫలితాలు సాధించాయి. కాంగ్రెస్, ఎన్సీపీని చావుదెబ్బ తీశాయి