యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, ఎన్నో సార్లు గెలిచినా వారిని మాత్రం దురదృష్టం వెంటాడుతూనే వస్తోంది. అలాంటి వారిలో పొన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ముందు వరుసలో ఉంటారు. పయ్యావుల కేశవ్ పార్టీ గెలిచినప్పుడు తాను ఓడిపోవడం, తాను గెలిచినప్పుడు పార్టీ ఓడిపోవడం జరుగుతూ వస్తోంది. దీంతో కేశవ్ మంత్రి పదవి కోరిక మాత్రం తీరలేదు. గత ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగా ఉరవకొండలో కేశవ్ ఓడిపోయారు. ఆయనకు మంత్రి పదవి రాలేదు.. ఆ తర్వాత బాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతే మాత్రం ఆయన విజయం సాధించారు.ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా పొన్నూరులో ఓడిన పార్టీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ది మరో బాధ. 1994 నుంచి 2014 ఎన్నికల వరకు ఓటమి లేకుండా వరుసగా ఐదుసార్లు విజయం సాధిస్తూ వచ్చిన నరేంద్ర గత ఎన్నికల్లో గెలిచాక మంత్రి పదవి ఆశించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా కూడా నరేంద్ర రికార్డు క్రియేట్ చేశారు. గత ఎన్నికల్లో ఐదోసారి గెలిచాక నరేంద్రను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారు. సంగం డైరీ ఛైర్మన్ విషయంలో చంద్రబాబుతో ఏర్పడిన విభేదాల వల్లే నరేంద్ర కు మంత్రి పదవి రాలేదు అన్న ప్రచారం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోను మంత్రి అవుతానని నరేంద్ర ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో నరేంద్ర ఆశలన్నీ రివర్స్ అయ్యాయి.పొన్నూరు నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందుతూ వస్తున్న నరేంద్ర ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన కిలారు వెంకట రోశయ్య నరేంద్రపై విజయం సాధించారు. నరేంద్ర చివరి వరకు గట్టిపోటీ ఇచ్చి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. గుంటూరు జిల్లాలో గతంలో వరుసగా ఐదు సార్లు గెలిచిన సీనియర్లలో ఆరో ప్రయత్నంలో ఓడిపోయి డబుల్ హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఇప్పుడు నరేంద్ర సైతం అదే బ్యాడ్ సెంటిమెంట్ కు బలయ్యారు. గతంలో మాజీ మంత్రులు మాకినేని పెదరత్తయ్య, కోడెల శివప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ
ఐదు సార్లు గెలిచి ఆరో ప్రయత్నంలో ఓడిపోయారు ఈ ఎన్నికలకు ముందు నరేంద్ర సెంటిమెంట్ చిత్తు చేస్తారని చాలా మంది భావించినా చివరకు నరేంద్ర సైతం అదే సెంటిమెంట్‌కు తల వంచక
తప్పలేదు. తన జీవితంలో ఐదు సార్లు గెలిచినా ఒక్క సారైనా మంత్రి పదవి చేపట్టాలన్న కోరికతో ఉన్న నరేంద్ర ఆశలు నెరవేరలేదు. ప్రతి సారి కొత్త వ్యక్తిపైనే గెలుస్తోన్న నరేంద్ర… ఈ సారి కూడా
తనకు కొత్త ప్రత్యర్థి అయిన రోశయ్య చేతిలో ఓడిపోయారు