యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అన్నీ ఉన్నా అదృష్టం కలసిరాకపోవడం అంటే ఇదేనేమో. విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడి దాదాపుగా గెలుపుదాకా వచ్చి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలు అయిన బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ తీవ్ర నిరాశలో ఇపుడు కూరుకుపోయాడు. కేవలం 4,400 ఓట్ల తేడాతో ఈ సీటుని వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ సాధించుకున్నాడు. మొత్తం మీద భరత్ దగ్గరదాకా వచ్చి ఓటమిపాలు అయ్యాడు. ఈ ఓటమికి కారణాలు తీస్తే క్రాస్ ఓటింగ్ దారుణంగా జరిగిపోయిందని తెలిసింది. ఎమ్మెల్యెకు ఒక ఓటు వేసుకుని ఎంపీ సీటుకు మీ ఇష్టం అని చాలా మంది టీడీపీ తమ్ముళ్ళు రాజకీయం చేశారని టాక్. దాంతో భరత్ గెలిచి ఓడిపోయినట్లైంది.ఇక ఈ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన జేడీ లక్ష్మీ నారాయణకు 2 లక్షల 88 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ, టీడీపీ తరువాత మూడవ పక్షంగా బాగా ఓట్లు కొల్లగొట్టారన్నమాట. ఇక విశాఖ అర్బన్ జిల్లాలో చూసుకుంటే నాలుగు ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుంది. అందులో రెండు చోట్ల భారీ మెజారిటీలు దక్కాయి. విశాఖ తూర్పులో అయితే 27 వేల మెజారిటీ లభించింది. విశాఖ పశ్చిమలో 20 వేల మెజారిటీ దక్కింది. ఈ రెండింటిలో కనీసం పదవ వంతు ఓట్లు భరత్ కి పడితే గెలుపు ఖాయం. మరి అక్కడ భారీ మెజారిటీలు వచ్చినా ఎంపీ వద్దకు వచ్చేసరికి ఓట్లు ఎలా తిరిగిపోయాయన్నదే భరత్ కి అర్ధం కావడం లేదు.ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు తమ వరకే చూసుకుని భరత్ విషయం పక్కన పెట్టారని అంటున్నారు. మరో వైపు జేడీ పోటీ వెనక టీడీపీ హై కమాండ్ ఉందని కూడా ప్రచారం ఉంది. ఇక జనసేన ఫ్యాక్టర్, బలమైన కాపు సామాజికవర్గం, విశాఖలోని
విద్యావంతులు, మేధావులు అంతా కలసి జేడీకి కట్టకట్టుకుని ఓట్లేశారు. జేడీకి పడిన ఓట్లు అన్నీ టీడీపీవేనని పోస్ట్ మార్టం లో తేలింది. జేడీ పోటీలో లేకుంటే భరత్ బంపర్ మెజారిటీతో గెలిచేవారు.
ఇక మరో వైపు బీజేపీ తరఫున పోటీ చేసిన పురందేశ్వరి భరత్ సామాజికవర్గం ఓట్లు చీల్చడంతో అన్ని వైపుల నుంచి వచ్చిన నష్టాలు, కష్టాలతో విశాఖ మాజీ ఎంపీ మూర్తి గారి మనవడు దారుణంగా ఓడిపోయాడు. మొత్తానికి భరత్ ఓటమికి తెర వెనక ఎన్నో శక్తులు పనిచేశాయని అంటున్నారు.