యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పును లిఖించారు. విభజన తర్వాత ఏపీకి బలమైన నాయకుడు కావాలని, అనుభవం ఉన్న నాయకుడు అవసరమని ఎంత ఊదరగొట్టినా.. ప్రజలు మాత్రం జగన్‌కు ఫిదా అయ్యారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఏపీలో ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఈ పరిణామం ప్రధాన రాజకీయపార్టీ అయిన టీడీపీ అనేక పాఠాలను నేర్పింది. అధికారంలో ఉండి కూడా ధర్నాలు చేయడం, కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా.. తర్వాత మరో విధంగా వ్యవహరించడం వంటి కీలక అంశాలపై ప్రజలు తమ ఓట్లతో బాబుకు కళ్లు తెరిపించారు. ఇక, ఇదే సమయంలో రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా కూడా ప్రజలు తమ తీర్పు ద్వారా ఆయా నేతలకు గట్టిగానే పాఠాలు నేర్పారు.ఎంత లేదనుకున్నా.. రాష్ట్రంలో సామాజిక వర్గాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా ల్లో కమ్మ వర్గం, ఉభయ గోదావురుల్లో కాపు వర్గాలు బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. అదేసమయంలో రాయల సీమలో రెడ్డి వర్గానికి మంచి పట్టుంది. దీంతో ప్రతి పార్టీ కూడా ఆయా సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇదే తరహాలో చంద్రబాబు కూడా ఈ దఫా ఎన్నికల్లో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని లెక్కలు ముగిసిన తర్వాతే.. ఆయన టికెట్ల పందేరం ప్రారంభించారు. కీలక నియోజకవర్గాల్లో వారసులను కూడా రంగంలోకి దింపారు. అయితే, వీరంతా ఓటమి పాలు కావడం గమనార్హం.ముఖ్యంగా అనంతపురం ఎంపీ
స్థానం, ఇదే జిల్లాలోని తాడిపత్రి నియజకవర్గంలో జేసీబ్రదర్స్ తమ కుమారులను రంగంలోకి దింపారు. తాజాగా ఎన్నికల్లో తమ పుత్రరత్నాలు గెలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే,
అనూహ్యంగా ఈ ఇద్దరూ కూడా మట్టి కరిచారు. అదేసమయంలో అటు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన రెడ్డి నాయకులను కూడా చంద్రబాబు గెలిపించుకోలేక పోయారు. దీంతో టీడీపీ గెలిచిన 23 ఎమ్మెల్యేల్లో స్థానాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్ల వరకు పార్టీలో రెడ్డి వర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. రాజకీయాల్లో సమతూకం ఉండాలనే చంద్రబాబు ఆశలపై తాజా ఎన్నికల ఫలితాలు నీళ్లు కుమ్మరించాయిఎన్నికల్లో జగన్ 53 మంది రెడ్డి వర్గానికి చెందిన వాళ్లకు సీట్లు ఇచ్చారు. చంద్రబాబు 27 మంది రెడ్లకు సీట్లు ఇస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. చంద్రబాబు సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఈ సామాజికవర్గ నేతలకు బాగానే సీట్లు ఇచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెండు ఎంపీ సీట్లలోనూ వైసీపీ రెడ్డి వర్గానికే సీట్లు ఇవ్వగా చంద్రబాబు మాత్రం ప్రకాశంలో వైశ్య వర్గానికి చెందిన సిద్ధా రాఘవరావు, నెల్లూరులో బీసీ బీద మస్తాన్‌రావుకు సీట్లు
ఇవ్వగా వారిద్దరు వైసీపీ రెడ్డి అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు.