యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
హస్తం పార్టీని రాజకీయ సంక్షోభం అంతర్గతంగా పట్టి కుదిపేస్తోంది. ఒకవైపు ఘోరపరాజయం..వారసుల కోసం పార్టీని పణంగా పెడుతున్న సీనియర్ల చిత్తశుద్ధి లేమి కాంగ్రెసును కకావికలం చేస్తోంది.
పార్టీ ప్రస్థానం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. గాంధీ కుటుంబంలో అయిదోతరం వారసుడు రాహుల్ గాంధీ అధ్యక్షపదవి నుంచి తప్పుకుంటానంటూ పట్టుబడుతున్నాడు. ప్రత్యామ్నాయం కనిపించక
పార్టీ తల్లడిల్లుతోంది. అలకలు, బుజ్జగింపులు, బతిమాలుకోవడాలు…ఇదేదో ఫ్యామిలీ అఫయిర్ లా మారిపోయింది…అధ్యక్షుడే అలిగితే పార్టీ ప్రస్థానమేమిటన్నదే ప్రశ్న..అసలు ఆ కుటుంబాన్ని
మినహాయిస్తే కాంగ్రెసులో సమర్థులే కరవు అయ్యారా? అన్నది మరో ప్రశ్న. అఖండ భారత్ అంతటా విస్తరించిన పార్టీ , అయిదున్నర దశాబ్దాలపాటు అన్నీ తానై దేశాన్ని పాలించిన పార్టీ
ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పటిష్ఠపరుచుకోకపోవడం చిత్రమైన పరిణామం. గాంధీ కుటుంబం అన్న పేరు మినహా మిగిలిన వారి నాయకత్వాన్ని ఆ పార్టీ ఎందుకు అంగీకరించలేకపోతుందో
అంతుచిక్కని విషయం.పార్టీ అధికారంలో లేకపోయినా పాత తరం నాయకుల బెడద ఇంకా వీడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారే అనుభవించారు. పవర్ పోయిన తర్వాత కూడా పెత్తనం
చేయాలనుకుంటున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా తమకు, తమ పిల్లలకు పదవులను బలవంతంగా డిమాండ్ చేస్తున్నారు. పార్టీని ఒత్తిడి చేసి ఒప్పిస్తున్నారు. ఈక్రమంలో పార్టీలో
నూతనోత్తాజాన్ని నింపే అవకాశాలు లోపిస్తున్నాయి. అందుకే పార్టీ సీనియర్ల పనితీరుపై రాహుల్ మనస్తాపం చెందుతున్నారు. అధ్యక్షుడి ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశం, అలక వెనక చాలా పెద్ద కథే దాగి
ఉందనవచ్చు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానంటూ రాహుల్ గట్టిగానే పట్టుబడుతున్నారు. వర్కింగ్కమిటీ సమావేశంలో అధ్యక్షస్థానానికి రాజీనామాసైతం చేసేశారు. కానీ సీడబ్ల్యుసీ
అంగీకరించలేదు. పార్టీ శ్రేయోభిలాషులు, పెద్దలు ఆయనను బతిమలాడుతున్నారు. గతంలో చాలామంది కాంగ్రెసు పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించారు. సమర్థులుగానూ నిరూపించుకున్నారు. కానీ
నెహ్రూ-గాంధీ కుటుంబం సిద్ధంగా లేని సమయంలోనే వారికి ఆ అవకాశం దక్కింది. ఇందిరా గాంధీ పార్టీని హస్తగతం చేసుకున్న తర్వాత మరింతగా పట్టు బిగించారు. నిజానికి సిండికేట్ తో కూడిన
కాంగ్రెసు ఆమెను అవమానించిన తర్వాత తానే కాంగ్రెసుపార్టీగా సొంత కుంపటి పెట్టుకున్నారు ఇందిర . అప్పట్నుంచి పార్టీ కుటుంబ ఆస్తిగా మారిపోయింది. ఇందిర,రాజీవ్ ల కాలం నుంచి కోటరీగా
ఉన్న సీనియర్లు ఇప్పుడు పార్టీపై స్వారీ చేయాలనుకుంటున్నారు.స్వాతంత్ర్యానికి పూర్వమే మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెసు పార్టీకి నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో
ఇందిర, రాజీవ్, సోనియా అధ్యక్షులుగా వ్యవహరించారు. అధ్యక్షపదవితోపాటు 2019లో పార్టీని ముందుకు నడిపే బాధ్యతను సోనియా రాహుల్ భుజస్కంధాలపై ఉంచారు. అధ్యక్షపగ్గాలు చేపట్టిన
తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో మంచి ఫలితాలు సాధించడం, గుజరాత్ లో సైతం అధికార బీజేపీని బలంగా ఎదిరించడం వంటి పరిణామాలు కాంగ్రెసులో జోష్ నింపాయి. ఆ తర్వాత
మళ్లీ యథాతథంగా కాంగ్రెసు భజన బృందాలు రంగప్రవేశం చేశాయి. రాహుల్ ను ఆకాశానికి ఎత్తేశాయి. దాంతోపాటు తమ రాజకీయ అవసరాలనూ నెరవేర్చుకునే కార్యక్రమాలు మొదలు పెట్టేశారు.
వారసులకు సీట్లు, కాంట్రాక్టులు, తమకు సీనియార్టీని బట్టి ఉన్నత పదవులు వంటివన్నీ మొదలైపోయాయి. మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కినా ముసలి నాయకులే ముఖ్యమంత్రి పదవులను
ఆశించారు. తమ పిల్లలకు ఎంపీటిక్కెట్లు బలవంతంగా పొందగలిగారు. ఫలితంగా పార్టీ అపజయం పాలైంది.విసుగెత్తిన రాహుల్ రాజీనామా చేస్తానంటూ పట్టుబట్టి కూర్చున్నారు. అన్నకు మద్దతుగా
రంగంలోకి దిగారు ప్రియాంక. పెద్ద నాయకులు పదవులు అనుభవించి పార్టీ కాడె పాడేస్తున్నారంటూ ప్రియాంక విరుచుకుపడ్డారు. రాహుల్ ఒంటరి పోరు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తానే
కాదు, తమ కుటుంబ సభ్యులెవరూ అధ్యక్షస్థానంలో వద్దంటు మంకు పట్టు పడుతున్నాడు రాహుల్. ఇది ఫ్యామిలీ బిజినెస్ కాదు. కాంగ్రెసులో ఇతరులు బాధ్యతతీసుకోవాలని ఆయన గట్టిగానే
కోరుతున్నారు.ఎంతపోరాడినా 52 స్థానాలకే కాంగ్రెసు పార్టీ కుదించుకుపోయింది. నాకొద్దుబాబోయ్ ఈ నాయకత్వం అంటున్నప్పటికీ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం కనిపించడంలేదు. కర్ణాటక, రాజస్థాన్
లలో పార్టీ పుట్టి మునిగిపోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతంతమాత్రం మెజార్టీతో ఉన్న కర్ణాటక, రాజస్తాన్ లలో అసంత్రుప్తి జ్వాలలు కమ్ముకుంటున్నాయి. ఈ అయిదేళ్లలో ఇంకా
అనేక రకాల విషమసమస్యలు చుట్టు ముడుతూనే ఉంటాయి. వీటన్నిటికీ ఏకైక పరిష్కారం తాను బాధ్యతల నుంచి తప్పుకోవడమే అన్న స్థిర నిర్ణయానికి రాహుల్ వచ్చేశారు. పార్టీని ఎంతోకొంత
నిలబెట్టుకోవాలి, వచ్చే ఎన్నికల నాటికి గట్టిపోటీ ఇవ్వాలంటే రాహుల్ కొనసాగాలనేది పార్టీలో కిందనుంచి పైస్థాయి వరకూ నాయకుల సింగిల్ డిమాండ్. అయితే నెలరోజుల వ్యవధిలో ఎవరో ఒకర్ని
ఎన్నుకోండి. తాను తప్పుకుంటానంటున్నారు రాహుల్. ఈ ఉదంతంపై ఇప్పటికే ప్రధాన ప్రత్యర్థి బీజేపీ రంగంలోకి దిగింది. ఆడలేక మద్దెల ఓడు అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. టీ కప్పులో
తుపానుగా ఈ వివాదం సమసి పోవచ్చు. కానీ జాతీయ పార్టీ ప్రతిష్ఠను మాత్రం మసకబారుస్తుంది. ఒక్క యుద్ధానికే చేతులెత్తేస్తానంటే ఎలా? అది నాయకత్వ సామర్ధ్యానికి గీటురాయి కాదు,
బలహీనతనే బయటపెడుతుంది. నిజంగా గర్వపడుతుంటారు