యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో కీలక పోస్టుల భర్తీకి కాబోయే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అడ్వొకేట్
జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పదవిలో కొత్త వ్యక్తి పేరును జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది. అడ్వొకేట్ జనరల్(ఏజీ)గా సుబ్రమణ్య శ్రీరామ్, అదనపు
అడ్వొకేట్ జనరల్(ఏఏజీ)గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ న్యాయవాదుల పేర్లను పరిశీలించిన కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శ్రీరామ్,
సుధాకర్‌రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు ఏజీని గవర్నర్ నియమిస్తారు. ఈనెల 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరవాత.. ఏజీ,
అదనపు ఏజీల నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అంతేకాకుండా, టీడీపీ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు(ఎస్‌జీపీ),
ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ), కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లు కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్తవాళ్లను నియమిస్తారు. వేసవి
సెలవుల తర్వాత జూన్ 3న హైకోర్టు పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేసుల విచారణకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు అనువుగా ఈలోపు ఎస్‌జీపీ, జీపీ, ఏజీపీ, స్టాండింగ్
కౌన్సిళ్ల నియామకాలను పూర్తి చేసేందుకు ఏజీగా, అదనపు ఏజీగా నియమితులుకానున్న శ్రీరామ్, సుధాకర్ రెడ్డి ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలిసింది.