యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంచలనం రిలయన్స్ జియో ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. ఏకంగా 5,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కసరత్తు చేస్తోంది. వ్యయాల నియంత్రణ, ఆపరేటింగ్ మార్జిన్ల పెంపు వంటి అంశాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. జియో తొలగించనున్న ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌తోపాటు కొంత మంది పర్మనెంట్ స్టాఫ్ కూడా ఉండే అవకావముంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. రిలయన్స్ జియో ఇప్పటికే దాదాపు 5,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ చూపించినట్లు తెలుస్తోంది. ఇందులో 600 మంది వరకు పర్మనెంట్ ఉద్యోగులు ఉండే అవకాశముంది. మరోవైపు రిలయన్స్ జియో మాత్రం వ్యయాల నియంత్రణకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేదని, ఉద్యోగులను నియమించుకుంటూనే ఉంటామని పేర్కొంది. జనవరి -మార్చి త్రైమాసికంలో రిలయన్స్ జియో ఆపరేటింగ్ మార్జిన్ 5 బేసిస్ పాయింట్ల తగ్గుదలతో 39 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. కంపెనీ వ్యయాలు క్వార్టర్ పరంగా చూస్తే దాదాపు 8 శాతం పెరిగాయి. సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోతకు అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. టీమ్ సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇప్పటికే టీమ్ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిపాయి.