రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు రూపంలో వ్యవహారంలో కేంద్రం పేచీ పెట్టింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేశామని ప్రకటించింది.మరో 2000
కోట్ల రూపాయలను ఇచ్చేస్తే.. తమ బాధ్యత తీరుపోతుందని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది.ఇప్పటిదాకా చేసిన ఖర్చులన్నింటికీ లెక్కలు చెబితే.. మిగిలిన ఆ 2000 కోట్ల రూపాయలను కూడా ఇచ్చేస్తామని వెల్లడించింది.ప్రాజెక్టులో కనీసం 50 శాతం పనులు కూడా పూర్తి కానేలేదు. ప్రస్తుత నిర్మాణ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి.కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో బిల్లులను చెల్లించాల్సి ఉంది. ఇన్ని పనులు అసంపూర్తిగా ఉండగా.. 2000 కోట్ల రూపాయలను చెల్లిస్తే తమ బాధ్యత తీరిపోతుందంటూ కేంద్రం ప్రకటించడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.వైఎస్
జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి ఇది తొలి సవాల్‌గా భావిస్తున్నారు.కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధీనంలో ఏర్పాటైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులు
విజయవాడలో రాష్ట్ర జలవనరుల మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశమయ్యారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిపై ఈ సందర్భంగా
అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్‌కే జైన్ ఆరా తీశారు. అంతకుముందు- పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 2000 వేల కోట్ల రూపాయలేనని తేల్చేశారు.ఇప్పటిదాకా నిర్మాణ పనుల కోసం చేసిన ఖర్చుల వివరాలకు సంబంధించిన బిల్లులను అందజేసిన వెంటనే 2000 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని అన్నారు.ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ప్రతిపాదనలను పంపించిందని, అది సరి కాదని చెప్పారు.తమ వద్ద ఉన్న
అంచనాల ప్రకారానికి అనుగుణంగా నిధులను విడుదల చేస్తామని అన్నారు.