యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
భారత భద్రతా దళాలపై మరో భారీ దాడికి ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని పుల్గాం సెక్టార్‌లో భారత్-పాక్ సరిహద్దు వెంట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైనికాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఐఎస్‌ఐ ఏజెంట్లుగా అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఒకరు కథువా, మరొకరు దొడా ప్రాంతానికి చెందినవారుగా తేలింది. నిందితులను ముస్తాక్ అహ్మద్, నదీమ్ అక్తర్‌గా గుర్తించారు. వీరిద్దరూ పాకిస్థాన్‌కు గూఢచర్యం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. సరిహద్దు వెంట గస్తీ కాస్తున్న జవాన్లకు ముస్తాక్, నదీమ్ అనుమానాస్పదంగా తిరుగుతూ కన్పించారు. పీవోకే సమీపంలోని రత్నుచాక్ ఆర్మీ క్యాంప్‌ను, వాటి పరిసరాలను వీడియో తీస్తూ వాళ్లు సైనికులకు చిక్కారు. దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల సెల్‌ఫోన్ల నుంచి కీలక సమాచారం లభ్యమైనట్లు సైనికాధికారులు వెల్లడించారు. అరెస్టుకు కొన్ని గంటల ముందు భారత్‌లోని పలు ప్రాంతాలను కవర్ చేస్తూ తీసినవీడియోలను పాక్‌లోని కొంతమందికి పంపినట్లు గుర్తించారు. పాక్‌కు చెందిన కొంత మందితో తరచూ ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వెల్లడైందని అధికారులు తెలిపారు. రత్నుచౌక్ ఆర్మీ క్యాంప్‌పై ఉరీ తరహా దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారేమోననే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.