యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా'.. ఈ మాట వినబడే సమయం ఆసన్నమయ్యింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం (30న) జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. స్టేడియాన్ని సుందరంగా అలంకరించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రతి ఒక్కరికి కార్యక్రమం కనిపించేలా.. స్టేడియంలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. స్టేడియంలో 30 వేలమందికి సీటింగ్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులు 5 రకాల పాస్‌లు జారీ చేశారు.. ఈ పాస్‌లు ఉన్నవాళ్లనే స్టేడియంలోకి అనుమతిస్తారు. ఏఆర్ గ్రౌండ్స్‌లో వీఐపీలకు.. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు సిద్దార్థ కాలేజీ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు. 5000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఏపీ పోలీస్, ఏపీఎప్పీ, అక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. డ్రోన్ కెమెరాలు, బాడీ ఎటాచ్‌డ్ కెమెరాలు, సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఎండాకాలం కావడం, ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏసీలతో పాటూ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటు వీఐపీలు, ప్రముఖులు కూడా తరలివస్తుండటంతో.. స్టేడియంలో మూడు గేట్లు వారికోసం కేటాయించారు. జగన్ ప్రమాణస్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. నేటి రాత్రికి ఏర్పాట్లన్నీ పూర్తి అవుతాయని వైసీపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ ముఖ్యనేతలు, అధికారులు ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తాజాగా స్టేడియంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లకు సంబంధించి డ్రోన్ తో చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చంద్రబాబు దూరం
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ తరపున ప్రతినిధుల్ని ఈ కార్యక్రమానికి పంపాలని తీర్మానించారు. గురువారం ఉదయం టీడీపీ బృందం జగన్ నివాసానికి వెళ్లనుంది. జగన్‌కు శుభాకాంక్షలు తెలుపనున్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన చంద్రబాబు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎల్పీ సమావేశంలో ప్రమాణ స్వీకారానికి జగన్ చంద్రబాబును ఆహ్వానించిన అంశంపై నేతలు చర్చించారట. జగన్ చంద్రబాబును ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే బాగుండేదని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇంటికెళ్లి మరి ఆహ్వానించిన జగన్.. బాబుకు మాత్రం ఫోన్ చేయడం ఏంటని వ్యాఖ్యానించారట. సమావేశంలో ఎక్కువమంది నేతలు చంద్రబాబు.. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. ఆయన మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ అంశాన్ని కూడా టీడీపీ నేతలు సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న వైసీపీ అధికారం చేపట్టబోతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
బెజవాడలో 70 అడుగుల కటౌట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం మొత్తం జగన్ ప్లెక్సీలు, పోస్టర్లతో నిండిపోయింది. తాజాగా విజయవాడలోని కనకదుర్గ వారధి వద్ద ఏకంగా 70 అడుగులు ఉన్న జగన్ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బొమ్మలను చేర్చారు.భారీ ఆకారంలో ఉన్న ఈ కటౌట్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
ప్రముఖుల హాజరు
వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 12.23గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారానికి పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు,రాజకీయ పార్టీల అధ్యక్షులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, డీఎంకే అధినేత స్టాలిన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీనటుడు చిరంజీవి, కాంగ్రెస్ నేత కేవీపీ రాంచందర్‌రావు, తదితరులకు ఫోన్ చేసి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. మంగళవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసిన జగన్ తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మోహన్ బాబు, బాలకృష్ణ, అక్కినేని నాగార్జునతో పాటు టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు తెలిసింది.