యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గురువారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం(ఐజీఎంసీ)లో ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సంచలన విజయానికి సారథ్యం వహించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే సాధారణ ప్రజలను స్టేడియం లోపలికి గేట్-3, గేట్-6 ద్వారా అనుమతించనున్నారు. సాధారణ ప్రజలు ఆయా ప్రాంతాల్లో వారికి కేటాయించిన స్థలంలోనే వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ప్రాంగణంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్ర్కీన్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి.