యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో జగన్ సృష్టించిన రాజకీయ సునామీలో టీడీపీ చిత్తుచిత్తుగా మారిపోయిన విషయం తెలిసిందే. హేమా హేమీలై న నాయకులు కూడా మట్టి కరిచారు. అయితే, ఒక్క జగన్ సునామీనే ఇంతగా టీడీపీని ఓడించిందా? లేక మరేదైనా కారణం కనిపిస్తోందా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా నాయకుల ఉదాసీనత, వేసిన రాంగ్ స్టెప్పు లు, తమను గెలిపించిన సామాజిక వర్గాన్ని కూడా పట్టించుకోకపోవడం వంటివి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. దీనికి ప్రధాన ఉదాహరణ.. ఆచంటలో ఓడిపోయిన మాజీమంత్రి పితాని సత్యనారాయణ. ఆయనను ఇక్కడ తన సొంత సామాజిక వర్గం కడుపులో పెట్టుకుని చూసుకుంది.రాజకీయంగా పితాని ఎన్ని చిందులు తొక్కినా.. ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ప్రజలు కూడా పితాని వెంటే నడిచారు. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ సామాజిక వర్గాన్ని ఎక్కడైనా పట్టించుకున్నారా? ఆ వర్గం సంక్షేమానికి ఎక్కడైనా కృషి చేశారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే పితానిని వెంటాడుతున్నాయి. ఆయన తన పబ్బం తాను గడుపుకోవడం వల్లే.. నేడు.. జగన్ సునామీకితోడు .. ప్రజల ఆగ్రహాన్ని ముఖ్యంగా సొంత సామాజిక వర్గం ఆగ్రహాన్ని ఆయన చవిచూడాల్సి వచ్చింది. మొత్తంగా మూడు సార్లు గెలిచిన పితాని.. ఏ పార్టీలో ఉన్నా.. ఆయన సొంత సామాజిక వర్గం శెట్టిబలిజ బ్రహ్మరథం పట్టింది.మనమంతా ఒకటే అంటూ.. శెట్టిబలిజను ఏకం చేసి.. తన రాజకీయ అవసరానికి వినియోగించుకున్నారు. 2004లో మనోడు అనే ఒకే ఒక్క కారణంగా ఇక్కడ శెట్టి బలిజ వర్గం మొత్తం పితాని వెంట నడిచింది. దీంతో ఆయన విజయం సాధించారు. అప్పటికే ఆయన వరుస ఓటములతో ఉండడంతో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. అన్నిసార్లు ఓడినా వైఎస్ దయతో సీటు వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచి పితాని తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక, 2009లోనూ మరోసారి కాంగ్రెస్ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన పితానికి అనూహ్యంగా టీడీపీ నుంచి కూడా సహకారం అందినట్టయింది. ఇక్కడ నియోజకవర్గంలో రెడ్డి వర్గంలేదు. కానీ, చంద్రబాబు అక్కడ రెడ్డి వర్గానికి ఛాన్స్ ఇచ్చారు ఇది పితానికి కలిసి వచ్చింది.ఇక, 2014లో జై సమైక్యాంద్రలోకి వెళ్లి చివరి నిముషంలో వచ్చి టీడీపీలోకి వచ్చి ఇక్కడ నుంచి పోటీ చేశారు. అదే సమయంలో వైసీపీ ఇక్కడ క్షత్రియ వర్గానికి అవకాశం ఇచ్చారు. ముదునూరి ప్రసాదరాజు ఇక్కడ పోటీ చేశారు. ఎంపీకి వచ్చే సరికి 13000 వైసీపీకి పెచ్చు వచ్చింది. అయితే, పితాని మాత్రం కేవలం రెండు ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, తాజా ఎన్నికల్లో మాత్రం తమను ఏమాత్రం పట్టించుకోలేదనే శెట్టిబలిజ వర్గం ఆగ్రహం, వైసీపీ అభ్యర్థి శ్రీరంగనాథరాజు భారీగా ప్రచారం చేయడం, జగన్ సునామీ వంటివి పితానిని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. మొత్తానికి పితానికి ఇప్పుడు సొంత సామాజిక వర్గం విలువేంటో తెలిసిందని అంటున్నారు. ఏ సామాజికవర్గం అండదండలతో ఆయన ఎదిగారో ఇప్పుడు ఆయన సామాజికవర్గాన్నే ఆయన నిర్లక్ష్యం చేయడంతో వాళ్లే రంగనాథరాజును గెలిపించారు.