యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
కడప జిల్లాలో ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటితోపాటు ఇంటింటికీ కొలాయి కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా రూ.1800కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. ఇందుకోసం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఇప్పటికే సర్వే మొదలుపెట్టారు.ప్రతి ఏడాది వేసవిలో తాగునీటి కోసం జనం విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వేసవిలో వాటర్ ట్యాంక్‌ల ద్వారా వందల గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో తాగునీటి సమస్య జఠిలంగా ఉంటుంది. వారికి ఏప్రాంతాల నుంచి సులభంగా నీటి సరఫరా చేయవచ్చు అనే విషయంపై సర్వే మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గంలో మంచినీటి పథకాలు ఏర్పాటుచేసి గ్రామీణ ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు దృష్టిసారించారు. జిల్లాలో ఉన్న 11 ప్రాజెక్టుల ద్వారా 2.82 టీఎంసీల నీటితో అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు గ్రౌండ్ లెవెల్ సర్వే సాగుతోంది. సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి నిధులు మంజూరు చేసేవిధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఉన్న పలుప్రాజెక్టుల నుండి నీటిని సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. బ్రహ్మంసాగర్ నుంచి 75గ్రామాలకు నీటిని ఇచ్చేందుకు రూ.5కోట్లతో ప్రణాళిక రూపొందించారు. అలాగే ఎస్‌ఆర్-2 నుంచి ఖాజీపేట మండలంలోని 84గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు రూ.37కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. మునిపాక స్కీమ్ నుంచి 106గ్రామాలకు రూ.7కోట్లతో తాగునీటి పథకాలు చేపట్టనున్నారు. బ్రహ్మంసాగర్ నుంచి బద్వేలు నియోజకవర్గంలోని బి.కోడూరు, కాశినాయన, పోరుమామిళ్ల, కలసపాడు పరిధిలోని 206గ్రామాలకు నీటిని అందించేందుకు రూ.100 కోట్లు కేటాయించనున్నారు. పెన్నానది నుంచి అట్లూరు, బద్వేలు, గోపవరం గ్రామాలకు నీరు అందించేందుకు రూ.49కోట్లు ఖర్చుచేయనున్నారు. రాయచోటి పరిధిలోని 118 గ్రామాలకు నీరు అందించేందుకు రూ.28కోట్లతో ప్రణాళిక రూపొందించారు. చెయ్యేరు నది నుంచి రాయచోటి, రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లి, సంబేపల్లి, చిన్నమండెం మండలాల్లో రూ.589 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.104 కోట్లు నిధులు అవసరమని భావిస్తున్నారు. చెయ్యేరు రిజర్వాయర్, వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లోని గాలివీడు, ఎల్‌ఆర్‌పల్లి, వీరబల్లి, రామాపురం మండలాల్లోని 677గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.128 కోట్లు నిధులు అవసరమని నిర్థారించారు. పెన్నానది నుంచి కమలాపురం నియోజకవర్గంలోని 91గ్రామాలకు రూ.20కోట్లతో తాగునీటి పథకాన్ని అందించాలని నిర్ణయించారు. కడప, కమలాపురం నియోజకవర్గంలోని 298 గ్రామాలకు రూ.140కోట్లతో తాగునీటి పథకాలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు నిర్ణయించారు. వల్లూరు మండలంలోని 69గ్రామాలకు రూ.20కోట్లతో తాగునీటి పథకాలు చేపట్టనున్నారు. సోమశిల బ్యాక్‌వాటర్‌నుంచి రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లోని 534గ్రామాలకు తాగునీరు అందించేందుకు మరో రూ.190కోట్లు అవసరమని నిర్ణయించారు. వచ్చేనెల 15 నాటికి ఈసర్వే పూర్తికానుంది. ఇందుకుసంబంధించి ఆయాశాఖల అధికారులు పూర్తిస్థాయిలో సర్వే సేకరణలో నిమగ్నమయ్యారు.