బత్తాయికి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. పాతికేళ్లుగా ఇంతటి ధర పలకలేదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. బత్తాయి తోటల వద్ద వ్యాపారులు టన్నుధర సుమారు రూ.48 వేలకు
కొనుగోలు చేస్తుండగా, హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో సోమవారం టన్నుధర రూ.55 వేలు పలికినట్లు రైతులు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు ఆగితే ఈ ధర మరింత పెరిగి
తోటలవద్దే రూ.50 వేలు దాటే అవకాశం ఉంది.బత్తాయి దిగుబడులు తగ్గిపోయినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనే కొంతవరకు దిగుబడులు ఉంటున్నాయి. కత్తెర(వేసవిలో) సీజన్‌లోనే బత్తాయికి
డిమాండ్ ఉంటుంది. ఈసారి దిగుబడి తగ్గి, వినియోగం పెరిగినందున డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో కత్తెర సీజన్‌కు అనుకూలంగా లేవు. నల్గొండ జిల్లా
రైతులు మాత్రం ఏటా కొంతమేరకైనా కత్తెర సీజన్‌లో దిగుబడి వచ్చేలా చూస్తున్నారు. ఫలితంగా వీరికి ప్రస్తుతం లాభాల పంట పండింది. నల్గొండ జిల్లాలో కూడా ఈసారి దిగుబడి చాలా తక్కువగానే
ఉందని వ్యాపారి ఒకరు వెల్లడించారు. నల్గొండ జిల్లానుంచి బత్తాయి రైతులు చాలామంది నేరుగా ఆగ్రా, కోల్‌కతా, నాగ్‌పూర్ మార్కెట్లకు తరలిస్తున్నారు. లారీల రాకపోకలకు ఇబ్బంది
కలగనంతవరకూ రవాణాకు ఎలాంటి ఆటంకం కలిగే అవకాశం ఉండదు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే లారీలు ఆగ్రా దాకా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడతాయని, దీంతో ధర తగ్గే ప్రమాదం
ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కాయ పక్వానికి రాకున్నా త్వరపడి తోటల్లో కాయలు కోస్తున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు
తెలంగాణలో నల్గొండ జిల్లాలు కత్తెర సీజనులో అధికంగా దిగుబడులు అందిస్తున్నాయి. ఈసారి అనంతపురం జిల్లాలోనూ కత్తెర బత్తాయి లేదని చెబుతున్నారు. దీంతో వారు సాధారణ
సీజన్‌లో(ఆగస్టు) వచ్చే కాయలను ఇప్పుడే కోసి మార్కెట్‌కు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.గత ఏడాది ఈ సమయంలో తోటల వద్ద రూ.40వేల నుంచి రూ.42వేల వరకు ధర పలికింది. అదే పెద్ద
ధరగా భావించారు. కానీ ఈసారి గతేడాదిని మరిపిస్తూ మరింతగా ఎగబాకింది. ప్రస్తుత సీజన్‌లో తోటల్లో పక్వానికి వచ్చిన బత్తాయికాయ ఉన్న రైతులు పెరిగిన ధర వల్ల సంతోషంతో ఉక్కిరిబిక్కిరి
అవుతున్నారు. సాధారణంగా వానాకాలం సీజనులో ఒక ఎకరం బత్తాయితోటలో సరిగ్గా కాస్తే ఎనిమిది నుంచి 12 టన్నుల బత్తాయి దిగుబడిని ఇక్కడి రైతులు సాధిస్తున్నారు. అయితే ప్రస్తుతం) కాస్త
తక్కువగా దిగుబడి ఉంటుంది.