అగ్రనేతల ఆత్మీయ ఆలింగనలు, అభినందనలు, ఆదరణపూర్వక ప్రశంసలు చూడటానికి బాగానే ఉంటాయి. అంతా సర్దుకుంటే చూసి సంతోషించాలని , సంబరాలు చేసుకోవాలని కోరుకునే అభిమానులకూ కొరత ఉండదు. కానీ వాస్తవ పరిస్థితులు అంత సాఫీగా, సమన్వయంతో ఉండవు. అటు కేంద్రంలో మోడీతో, ఇటు తెలంగాణలో కేసీఆర్ తో కలిసి నడుస్తామంటూ ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ మోహన్ రెడ్డి స్నేహహస్తం చాచడం ఆహ్వానించదగ్గ పరిణామమే. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్రప్రభుత్వాల మధ్య తీవ్ర వైరుద్ధ్యాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకత్వం మధ్య నెలకొన్న విభేదాలు రాష్ట్రాల మధ్య వైరంగా పరిణమించాయి. దీనికి ఇప్పటితో చెక్ పడుతుందనే ఆశలు మొలకెత్తుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర
ప్రయోజనాలు అనే బ్రహ్మపదార్థం సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది. నదీ జలాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, ఆస్తుల పంపకం వంటి పీటముడులు చాలానే ఉన్నాయి. కేంద్రంతో ప్రత్యేక హోదా జగడం మిగిలే ఉంటుంది. ఎక్కడో ఒక చోట రాజీ పడాలనే సంకేతాలు అందుతున్నాయి. మొత్తమ్మీద కేంద్ర, రాష్ట్రాల రాజకీయ సంబంధాలు, పాలన వ్యవహారాలు ఎలా
ఉండబోతున్నాయనే అంశం చర్చనీయమవుతోంది. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో సాధించిన విజయాన్ని ఒక బ్రాండ్ గా మార్చుకోవాలంటే కేంద్రం సహకరించాలి. అయితే కేంద్రానికి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు మద్దతు అవసరం లేదు. కావాల్సినంత మెజార్టీ ఉంది. ఈ పరిస్థితుల్లో చాలా చాకచక్యంగా, రాజకీయంగా వ్యూహాత్మకంగా మాత్రమే కేంద్రం నుంచి డిమాండ్లు సాధించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు. మోడీ ప్రత్యేక ప్యాకేజీ తప్ప హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. రాజకీయంగా మిత్రపక్షాన్ని పక్కన పెట్టడానికి సైతం సాహసించారు తప్పితే ఏమాత్రం టీడీపీ ఒత్తిడికి తలొగ్గలేదు. ఇప్పుడు వైసీపీది కూడా అదే ప్రధాన డిమాండు. మోడీ అంగీకరిస్తే హోదాకు అడ్డుచెప్పేవారు ఎవరూ లేరు. కానీ ఆయన తగ్గి తలొగ్గాల్సిన పొలిటికల్ కంపల్సన్ లేదు. ఈ పరిస్థితులే వైసీపీకి విషమంగా మారబోతున్నాయి. డిమాండుకు , కేంద్రానికి మధ్య రాజీపడితే తొలిదశలోనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజధానిపై కేంద్ర సహకారం ఎంతోకొంత అవసరం. ప్రత్యేక హోదా ఇవ్వలేం. స్పెషల్ పర్పస్ వెహికల్ పెడితే నిధులిస్తామంటోంది కేంద్రం. దీనిపై వైసీపీ ఎటుమొగ్గుతుందనేది తేలాల్సి ఉంది.వైసీపీ, ఎన్డీఏ లో చేరితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అందుకుగల అవకాశాలను అగ్రనాయకుల స్థాయిలోనే పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫీలర్లను
వదులుతున్నారు. 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. పైపెచ్చు పోలవరం కట్టాలి. సకాలంలో నిధులు రావాలి. కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి ద్రవ్య నిర్వహణ, బడ్జెట్ మేనేజ్ మెంట్ చట్టం లో కొంతమేరకైనా సడలింపులు అవసరం. ఇప్పుడు రాష్ట్రం స్థూల జాతీయోత్పత్తిని అనుసరించి చూస్తే 24 వేల కోట్ల రూపాయల వరకూ ఏడాదికి అప్పు తెచ్చుకోవచ్చు. జీఎస్డీపీలో 3 శాతం వరకూ ఈ రుణపరిమితి ఉంది. మరో అర శాతం సడలించేందుకు కేంద్రానికి వెసులుబాటు ఉంది. దానిని చేయగలదా? లేదా? అన్నది వేచి చూడాలి. పైపెచ్చు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు వేల కోట్ల రూపాయల నిధులు అవసరం. ఇది ఒక సమస్య. అయితే మద్యనిషేధం అమలు చేస్తామంటూ వైసీపీ ఇచ్చిన హామీ తలకు మించిన భారం. దీనివల్ల 20 వేల కోట్ల రూపాయల వరకూ ఆదాయం పడిపోతుంది. దీనిని పూడ్చుకోవడం అంత సులభం కాదు. అందుకే ఏం జరగబోతోందనే ఉత్కంఠ వ్యక్తమవుతోంది.రాజకీయంగా ఎంతైనా సన్నిహిత సంబంధాలు ఉండవచ్చు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికొచ్చేసరికి గట్టిగా ఉండకతప్పదు. నదీ జలాల పంపిణీపై ఇంకా తెలంగాణ పట్టువీడటం లేదు. కాళేశ్వరం నిర్మాణం గోదావరి జలాలకు గండికొడుతుందనే
అనుమానాలున్నాయి. అలాగే పోలవరం నిర్మాణంపై న్యాయపరమైన కేసుల పోరాటం కొనసాగిస్తూనే ఉంది. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల పై ఆస్తుల విభజన ఇంకా కొలిక్కి రాలేదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా రాజకీయపరమైన స్టాండ్ తీసుకోవడంతో రెండు రాష్ట్రాలు ఉప్పునిప్పులా మారిపోయాయి. రాజకీయ విభేదాలతో కాలయాపన చోటు చేసుకుంది. ఏడాది కాలంగా ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు రాజకీయంగా అనుకూలంగా వాతావరణం ఏర్పడింది. అయితే చంద్రబాబు, కేసీఆర్ లు ఇద్దరూ పట్టువిడుపుల్లేకుండా వ్యవహరించి సమస్యను జటిలం చేసేశారు.
వివాదాస్పద అంశాలపై వెంటనే రాజీకి వచ్చేస్తే ప్రజలు అనుమానించే అవకాశం ఉంటుంది. పైపెచ్చు రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ తెలంగాణలో కాంగ్రెసు, ఆంధ్రాలో తెలుగుదేశంపొలిటికల్ అస్త్రాలను బయటికి తీసే ప్రమాదం ఉంది. అందువల్లనే సమస్యలు అంత సులభంగా పరిష్కరించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అందులోనూ కేసీఆర్, జగన్ లు పంతాలు,
పట్టుదలలకు పెట్టింది పేరు. తమ రాష్ట్రప్రయోజనాలకు చౌకీదార్లుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారే తప్ప రాజీ పడినట్లు కనిపించాలనుకోరు.