యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయబోతున్న జగన్.. మంత్రివర్గ విస్తరణపైనా ఫోకస్ పెట్టారు. మంత్రుల జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్న జగన్.. జూన్ 7న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు కాగానే.. శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జూన్ 11, 12 తేదీల్లో శాసనసభ ప్రత్యేక
సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారట. శాసనసభ నిర్వహణపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. అసెంబ్లీ అధికారులతో చర్చించినంట్లు తెలుస్తోంది. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా.. శాసనసభ కార్యాలయానికి సమాచారం అందినట్లు సమాచారం. ఈ సెషన్స్‌లో కేవలం స్పీకర్ ఎన్నిక, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందట.. జూన్ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక జగన్ పూర్తిస్థాయిలో పాలనపై దృష్టిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో సీఎం కార్యాలయం సిద్ధం చేస్తున్నారట. ఈ ఏర్పాట్లను వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. జూన్ 3 నుంచి ముఖ్యమంత్రి హోదాలో జగన్ శాఖలవారీగా సమీక్షలకు సిద్ధమవుతున్నారట.