యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తాజాగా జరిగిన ఎన్నికల్లో విపక్షంలో ఉన్న వైసీపీ భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. కనీ వినీ ఎరుగని స్థాయిలో అసెంబ్లీ స్థానాలను కొల్లగొట్టి, పార్లమెంటు స్థానాలను కైవసం
చేసుకుని అధికారాన్ని అధిరోహించింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో భారీ ఎత్తున ఆనందం తాండవిస్తోంది. అదేసమయంలో గత 2014లో వైసీపీ తరఫున గెలిచి, అసెంబ్లీలోకి కాలు పెట్టి, ఆ తర్వాత
టీడీపీకి అమ్ముడు పోయిన కొందరు అభ్యర్థులు తాజా ఎన్నికల్లో పూర్తిగా మట్టికరిచారు. గత 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి కూడా మంత్రి పదవులు, కాంట్రాక్టుల కోసం వారంతా టీడీపీలోకి
చేరిపోయారు. ఇలాంటి వారిలో కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖంగా తెరమీదికి వస్తున్నారు.కృష్ణాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ కేవలం 2014లో 5 స్థానాల్లోనే విజయం సాధించింది.
విజయవాడ పశ్చిమ, నూజివీడు, గుడివాడ, పామర్రు, తిరువూరు. వీటిలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీరంతా కూడా జగన్‌కు ఆప్తులుగా మెలిగారు. అయితే, కొన్నాళ్లకు వీరిలో
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పామర్రు ఎస్సీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనలు చంద్రబాబు చెంతకు చేరిపోయారు. జలీల్‌కు మంత్రి పదవి, అది కూడా మైనార్టీ
కోటాలో ఇస్తామని చెప్పడంతో అప్పటి వరకు జగన్‌కు ఎంతో నమ్మకంగా ఉన్న జలీల్ రాత్రికి రాత్రి శిబిరం మారిపోయి.. జెండా మార్చేశారు. ఇక, ఉప్పులేటి కల్పన కూడా ఇంతే. నామినేటెడ్ పదవి
కోసం, కాంట్రాక్టుల కోసం ఆశించి శిబిరం మారిపోయింది.కల్పన 2004, 09తో పాటు తాజా ఎన్నికల్లో మొత్తం మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక
2014లో మాత్రమే ఆమె పామర్రులో వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం 713 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆమె టీడీపీ ఆఫర్లతో పసుపు కండువా కప్పుకున్నారు. అటు జలీల్‌ఖాన్
కూడా అంతే. అయితే, అనూహ్యంగా ఈ ఇద్దరికీ టీడీపీలోనూ అనుకున్న కోరికలు తీరలేదు. మంత్రి పదవి వస్తుందని భావించిన జలీల్‌కు చంద్రబాబు ఆ పదవిని ఇవ్వలేదు. ఇక, నామినేటెడ్ పదవి
వస్తుందనుకున్న కల్పన పరిస్థితి కూడా మారలేదు., దీంతో ఇద్దరూ వేచి చూడాల్సి వచ్చింది. ఇంతలోనే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. పశ్చిమ నుంచి జలీల్ కుమార్తె, పామర్రు నుంచి కల్పనలు పోటీ
చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయారు.పార్టీ మారినందుకు వీరికి ప్రజలు బుద్ధి చెప్పడం.. అటు ఫ్యాన్ వేవ్‌తో వీరు ఓటమి పాలవ్వక తప్పలేదు. ఈ ఇద్దరూ జగన్ చెంతనే ఉండి ఉంటే.. కనీసం పరువైనా
మిగిలి ఉండేదని, పైగా ఇప్పుడు కేబినెట్‌లో మంత్రిపదవులు కూడా దక్కి ఉండేవని అంటున్నారు. ఇటు కల్పన ఎస్సీ + మహిళా కోటాలో, అటు జలీల్‌ఖాన్ మైనార్టీ కోటాలో తప్పనిసరిగా మంత్రి
పదవి రేసులో ఉండేవారు. మొత్తానికి జగన్‌కు షాక్ ఇచ్చిన వీరికి జనాలే షాక్ ఇచ్చారన్న వాదన కృష్ణా జిల్లాలో బలంగా వినిపిస్తోంది.