యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జగన్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామనీ, ఇందుకోసం ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ను నియమిస్తామన్నారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, ప్రజాసేవ చేయాలనుకునే పిల్లలను ఇందుకు ఎంపిక చేస్తామని జగన్ తెలిపారు. వీరికి గౌరవవేతనంగా రూ.5,000 చెల్లిస్తామని వెల్లడించారు. ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వాలంటీర్లకు ఈ మొత్తం చెల్లిస్తామని చెప్పారు. మెరుగైన ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ పిల్లలకు గ్రామ వాలంటీర్లుగా అవకాశాలు కల్పిస్తామన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు అందకుంటే, లంచాలు, వేధింపులు జరిగితే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ ను కూడా ఆగస్టు 15న ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కాల్ సెంటర్ తన కార్యాలయంలో ఉంటుందని స్పష్టం చేశారు.